ట్రాక్టర్‌ను ఢీకొట్టిన కారు - ఇద్దరు మృతి 'బస్సుకింద పడి మరొకరు' - road Accidents in ap
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 10, 2024, 12:32 PM IST
Died After Falling Under Bus :అన్నమయ్య జిల్లా రాజంపేటలో ఆర్టీసీ బస్టాండ్‌లో గుర్తు తెలియని వ్యక్తి బస్సు కింద పడి మృతి చెందాడు. ఆర్టీసీ డ్రైవర్ నిర్లక్ష్యంతోనే ఒక నిండు ప్రాణం పోయిందని స్థానికులు అనుమానం వ్యక్తం చేశారు. రాత్రి సమయంలో ఈ సంఘటన జరగడంతో విషయం ఆర్టీసీ అధికారులు, పోలీసులకు తెలియలేదు. పోలీసులు కేసు నమోదు చేసుకొని మృతికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.
ఇద్దరు మృతి : బాపట్ల జిల్లా బల్లికురవ మండలం కొప్పెరప్పాడు గ్రామ శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇరువురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం వినుకొండ మండలం పిట్టలవానిపాలెంకు చెందిన ట్రాక్టర్ కట్టెల లోడుతో అద్దంకి వైపు వెళుతుండగా కొప్పెరప్పాడు గ్రామ శివారు వద్ద వెనుక నుండి హైదరాబాదు నుంచి వస్తున్న కారు ట్రాక్టర్‌ను బలంగా ఢీ కొట్టింది. దీంతో కారు యజమాని దీపక్ రావు అక్కడికక్కడే మృతి చెందారు. ట్రాక్టర్ డ్రైవర్ ప్రక్కన కూర్చొని ఉన్న ఆంజనేయులు అనే వ్యక్తి ట్రాక్టర్‌పై నుంచి కింద పడి మరణించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వేమన తెలిపారు.