వైసీపీని ఇంటికి పంపే రోజులు దగ్గరలోనే ఉన్నాయి: ధూళిపాళ్ల - వైసీపీ పార్టీ వార్తలు
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 27, 2023, 10:26 PM IST
Dhulipalla Narendra Fires on YCP Illegal Gravel Mining: రాష్ట్రంలో ధ్రుతరాష్ట్రుడి పాలన చూస్తున్నామని తెలుగుదేశం నేత ధూళిపాళ్ల నరేంద్ర మండిపడ్డారు. ముఖ్యమంత్రి జగన్ అండతోనే వైసీపీ నేతలు వందల అడుగుల లోతులో అక్రమంగా గ్రావెల్ తొవ్వుతూ నేలతల్లికి గర్భశోకాన్ని మిగులుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.అక్రమ గ్రావెల్ తవ్వకాలను వ్యతిరేకిస్తూ గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గంలో చేపట్టిన రెండు రోజుల పాదయాత్ర ముగియటంతో శేకూరులో బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభలో టీడీపీ సీనియర్ నాయకులు, నియోజకవర్గ నేతలు పాల్గొన్నారు. వైసీపీ నేతలను ప్రజలు ఇంటికి పంపే రోజులు దగ్గరలోనే ఉన్నాయని ధూళిపాళ్ల అన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తేనే ఈ ప్రాంత యువతకు వైట్ కాలర్ ఉద్యోగాలు సాధ్యమని ధూళిపాళ్ల అన్నారు.
భారీ యంత్రాలతో వందల అడుగుల లోతుకు నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు చేస్తున్నారు. జిల్లా యంత్రాంగం సాక్షిగా ప్రభుత్వ సహకారంతో అడ్డగోలుగా తవ్వకాలు కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఒక ధ్రుతరాష్ట్రుడి పాలన చూస్తున్నాం. జగన్ అధికారంలో నుంచి దిగిపోయే సరికైనా యువతకు ఉద్యోగాలు కల్పిస్తారేమో చూస్తాం. -ధూళిపాళ్ల నరేంద్ర, టీడీపీ నేత