Dharna For Kadapa Steel Plant: కడప ఉక్కు కర్మాగారం కోసం అఖిలపక్ష నేతల ధర్నా
Kadapa Steel Plant in Rayalaseema : రాయలసీమలో కడప ఉక్కు కర్మాగారం నిర్మాణం సాధ్యం కాదని లోక్సభలో కేంద్ర ఉక్కు సహాయం మంత్రి ప్రకటన చేయడం దారుణమని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి హరి ప్రసాద్ అన్నారు. రాష్ట్రం నుంచి 23 మంది ఎంపీలను ఇచ్చినా ప్రయోజనం లేదని.. కనీసం ఏ ఒక్క ఎంపీ కూడా నోరు మెదపకపోవడం దారుణమని ఆరోపించారు. కడపలో ఉక్కు కర్మాగారం నిర్మించాలని డిమాండ్ చేస్తూ కడప ఆర్డీవో కార్యాలయం ఎదుట అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కేంద్రం మెడలు వంచి ఉక్కు కర్మాగారాన్ని సాధించాల్సిన సీఎం జగన్ మోహన్ రెడ్డి కేంద్రం వద్ద మెడలు వంచుతున్నాడని, నోరు మెదపకపోవడం సిగ్గుచేటని అన్నారు. జగన్ దిల్లీ వెళ్లిన ప్రతిసారి తన కేసుల గురించి ప్రస్తావిస్తున్నాడే తప్ప.. ఉక్కు కర్మాగారం గురించి ఏనాడూ ప్రస్తావించిన దాఖలాలు లేవని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. విభజన చట్టంలోని హామీలను అమలుపరచాలని.. రాయలసీమకు ఉక్కు కర్మాగారాన్ని నిర్మించాలని, లేనిపక్షంలో రాయలసీమ ప్రాంత ప్రజలందరూ పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతారని హెచ్చరించారు. ముఖ్యమంత్రి రాయలసీమ ప్రజలను నిలువునా మోసం చేశారని, కేంద్రం ఉక్కు కర్మాగారం నిర్మించడం లేదని గతంలో చెప్పినప్పటికీ ఆయన ఇటీవల జిందాల్ సంస్థతో భూమి పూజ చేయించడం మోసం కాదా అని ఆయన ప్రశ్నించారు.