Farmers on Police regarding Guntur channel గుంటూరు ఛానెల్ కోసం ధర్నా చేసిన మహిళలపై పోలీసుల తీరు అభ్యంతరకరం..
Police brutality in Guntur district : గుంటూరు ఛానెల్ పొడిగించి తాగు, సాగు నీరు ఇవ్వాలని కోరుతూ చేపట్టిన నిరసనలో మహిళల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరు సభ్య సమాజం తలదించుకునేలా ఉందని నల్లమడ రైతు సంఘం నేతలు మండిపడ్డారు. మూడు రోజుల క్రితం గుంటూరు ఛానెల్ పొడింపుపై స్థానిక మహిళల లు, రైతులు ధర్నా చేశారు. ఈ ధర్నాలో పాల్గొన్న మహిళల చీరలు ఊడిపోతున్న కూడా పోలీసులు ఈడ్చుకెళ్లడం వివాదానికి దారి తీసింది. ఈ ఘటనపై గుంటూరు జిల్లా పెదనందిపాడులో విలేకర్ల సమావేశంలో రైతు సంఘం నేత కొల్లా రాజమోహన్ రావు మాట్లాడుతూ.. గుంటూరు ఛానెల్‌కి నిధులు మంజూరు చేయాలని నిరసనలు తెలిపిన మహిళలపై పోలీసులు దౌర్జన్యం చేయడం దారుణమన్నారు. మహిళలని గౌరవం కూడా లేకుండా పోలీసులు ఈడ్చికెళ్లడం దమనకాండకు నిదర్శనమన్నారు. స్థానిక ఎమ్మెల్యే సుచరిత సైతం ఒక మహిళేనని ఆమె ఎందుకు ఇలా చేయిస్తున్నారని ప్రశ్నించారు. మహిళలను ఉద్యమాలలోకి రాకుండా చేయాలని ఇలా దౌర్జన్యం చేస్తున్నారని ఆరోపించారు. పోలీసుల దౌర్జన్యంపై మీడియా సమావేశంలో కొందరు మహిళలు కన్నీటి పర్యంతమయ్యారు. గుంటూరు ఛానెల్ కోసం తాము పోరాటం మాత్రం ఆపే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు.