బూడిద అక్రమ రవాణా చేస్తూ మంత్రి జోగి రమేష్, ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ కోట్లు కొల్లగొడుతున్నారు - దేవినేని ఉమ - Ash Illegal Transport in vijayawada
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 16, 2023, 1:42 PM IST
Devineni Uma Protest Against Ash Illegal Transport: బూడిద అక్రమ రవాణాపై నిరసన తెలిపేందుకు బయల్దేరిన తెలుగుదేశం సీనియర్ నేత దేవినేని ఉమను.. పోలీసులు ఆయన నివాసం వద్దే అడ్డుకున్నారు. ఎన్టీఆర్ జిల్లా గొల్లపూడిలోని నివాసం వద్ద నిలువరించడంతో ఉమ.. అక్కడే రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఇబ్రహీంపట్నంలో బూడిద అక్రమ రవాణాపై నిరసన వ్యక్తం చేసేందుకు.. బూడిద చెరువు వద్దకు జనసేన నాయకులతో కలిసి వెళ్లేందుకు.. దేవినేని ఉమ సిద్ధమయ్యారు. ఈ క్రమంలో ముందస్తుగానే ఉమ ఇంటి వద్దకు చేరుకున్న పోలీసులు.. ఆయన్ని వెళ్లనీయకుండా అడ్డుకున్నారు.
ఈ క్రమంలో పోలీసులు, తెలుగుదేశం, జనసేన శ్రేణుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పోలీసుల వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఉమ.. నిరసన తెలపకుండా అడ్డుకునే హక్కు ఎవరిచ్చారని ప్రశ్నించారు. ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్, మంత్రి జోగి రమేష్‌ల బూడిద దోపిడీని ఎండగడతామన్న భయంతోనే నిరసనలను అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ''బూడిద అక్రమ రవాణాను ఆపాలి.. ప్రజారోగ్యాన్ని కాపాడాలి'' అంటూ నినాదాలు చేస్తూ.. కార్యకర్తలతో కలిసి.. తన నివాసం నుంచి ర్యాలీగా ఉమ బయల్దేరారు. బూడిద అక్రమ రవాణాతో మంత్రి జోగి రమేష్, ఎమ్మెల్యే వసంతకృష్ణప్రసాద్ కోట్ల రూపాయలు కొల్లగొడుతున్నారని మండిపడ్డారు.