Demolition of Houses in Violation of Court Orders : రోడ్ల పక్కన నిర్మాణాలు కూల్చివేత.. కోర్టు ఆదేశాలు పట్టించుకోని అధికారులు
By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 30, 2023, 8:13 PM IST
Demolition of Houses in Violation of Court Orders : అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలోని బొమ్మనహాల్ మండలం ఉద్దేహాల్ గ్రామంలో రోడ్డు పక్కన నిర్మాణాలను అధికారులు కూల్చివేశారు. బుధవారం భారీ పోలీసు బందోబస్తు నడుమ అధికారులు వాటిని తొలగించారు. న్యాయస్థానం నుంచి ఇంజక్షన్ ఆర్డర్లు తెచ్చుకున్నామని బాధితులు అధికారులకు పత్రాలు చూపించినా.. అవేమీ పట్టించుకోలేదు. జేసీబీలు, యంత్రాలతో ఇళ్లను కూలదోశారు. బొమ్మనహాల్ మండలం న్యూస్ టుడే కంట్రిబ్యూటర్ కావలి వెంకటేశులకు చెందిన నిర్మాణాలను కూల్చివేశారు. ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి ( MLA Kapu Ramachandra Reddy ), రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు రాస్తున్నాడని కక్షగట్టి తొలగించారని బాధితుడు ఆందోళన వ్యక్తం చేశాడు. వెంకటేశులతో పాటు మరో ఆరుగురికి చెందిన ఇళ్లు, ప్రహరీలను కూల్చివేశారు. పోలీస్, రెవెన్యూ, మండల పరిషత్, గ్రామ సచివాలయ ఉద్యోగులు ( Village Secretariat employees ) సంయుక్తంగా పాల్గొన్నారు.
నిర్మాణాల తొలగింపు నేపథ్యంలో గ్రామంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఉద్దేహాల్ గ్రామంలో 2017 సంవత్సరంలో ప్రభుత్వ స్థలంలో ఆక్రమణలు ఉంటే తొలగించుకోవాల్సిందిగా హైకోర్టు గ్రామపంచాయతీ అధికారులకు అనుమతులు మంజూరు చేసింది. గ్రామంలో సంత మార్కెట్ జరుగుతున్న శ్రీ ఉలిగమ్మ ఆలయం వద్ద, ఆర్ అండ్ బీ రహదారికి ఇరువైపులా ఆక్రమణలు ఉన్నాయని వాటిని తొలగించాలని 23 మందికి గ్రామపంచాయతీ వారు నోటీసులు జారీ చేశారు. వీరిలో కొంత మంది కోర్టు నుంచి స్టే (Court stay) తీసుకువచ్చారు. దీంతో కొన్నాళ్లుగా పట్టించుకోని అధికారులు.. తాజాగా కూల్చివేత చేపట్టారు. రాజకీయ కక్షలు అధికార పార్టీ, ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా వార్తలు వస్తున్నాయనే అక్కసుతో తొలగింపు చేపట్టారని ఆరోపణలు వినిపించాయి. కూల్చివేత సందర్భంగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ముగ్గురు సీఐలు, ఆరుగురు ఎస్ఐలు, 70 మంది పోలీసులు మోహరించారు.