కబ్జాదారులకు అనుకూలమైన చట్టాన్ని రద్దు చేయాల్సిందే- కొనసాగుతున్న న్యాయవాదుల ఆందోళనలు - Protests by lawyers in the state
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 21, 2023, 10:44 PM IST
Demands of Advocates in AP : పేదల హక్కులను హరించే భూహక్కు చట్టంను రద్దు చేయాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులు ఆందోళనలు చేస్తునే ఉన్నారు. ఇలాంటి చట్టంతో భూములన్నీ భూస్వాముల చేతుల్లోకి వెళ్లిపోయే ప్రమాదం ఉందని తెలుపుతున్నారు. ఈ పద్ధతితో అధికారం కలిగిన వ్యక్తుల చేతుల్లోకి వ్యవస్థ వెళ్లిపోతుందని న్యాయవాదులు పోరాటం చేస్తున్నారు. తాజాగా కాకినాడ జిల్లా తునిలో భూ హక్కు చట్టాన్ని రద్దు చేయాలని న్యాయవాదులు నిరసన చేపట్టారు. గొల్ల అప్పారావు కూడలిలో మానవ హారం నిర్వహించారు. కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో భూ హక్కు చట్టాన్ని వ్యతిరేకిస్తూ బార్ కౌన్సిల్ నిరసన వ్యక్తం చేసింది.
ప్రభుత్వం ఈ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని న్యాయవాదులు డిమాండ్ చేశారు. కర్నూలు జిల్లాలో న్యాయవాదులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 11వ రోజుకు చేరాయి. సివిల్ కోర్టులకు భూ తగాదాల కేసులు విచారించే అవకాశం లేదన్నారు. కేవలం రెవెన్యూ ట్రిబ్యునల్ కేసులు మాత్రమే విచారించవచ్చని న్యాయవాదులు గుర్తు చేశారు. కబ్జాదారులుకు అనుకూలమైన ఈ చట్టాన్ని రద్దు చేయకపోతే ఆందోళనలు తీవ్రతరం చేస్తామనని న్యాయవాదులు హెచ్చరించారు.