Delhi Liquor scam: మాగుంట రాఘవ బెయిల్ ఐదు రోజులకు కుదింపు.. కారణమేంటంటే..! - దిల్లీ లిక్కర్ కేసు
Magunta Raghava Reddy bail: దిల్లీ మద్యం కుంభకోణం కేసులో మాగుంట రాఘవ్ బెయిల్‌ను 2 వారాల నుంచి సుప్రీంకోర్టు ఐదు రోజులకు కుదించింది. ఈ నెల 12న స్థానిక కోర్టు ఎదుట హాజరుకావాలని ఆదేశించింది. మాగుంట రాఘవ్‌కు బెయిల్ మంజూరుపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. బెయిల్ పొందే విషయంలో కోర్టుకు రాఘవ్ అబద్ధాలు చెప్పారని ఈడీ న్యాయవాది వాదించారు. మోసపూరితంగా బెయిల్ పొందారన్నారు. తొలుత అమ్మమ్మకు, తర్వాత నానమ్మకు అనారోగ్యం అన్నారన్న ఈడీ న్యాయవాది.. భార్య ఆత్మహత్నాయత్నం పేరుతో తప్పుడు ఆధారాలు ఇవ్వబోయారన్నారు. నివేదికలు, ధ్రువపత్రాలు పరిశీలించాలంటే మాత్రం పిటిషన్ వెనక్కి తీసుకున్నారని వెల్లడించారు.
ధనవంతులు ఇలాంటి వైద్య నివేదికలు తేవడం పరిపాటిగా మారిందన్నారు. రాఘవ్‌కు సాధారణ బెయిల్ ఇచ్చేందుకు ట్రయల్ కోర్టు నిరాకరించిందన్న ఈడీ న్యాయవాది.. కుటుంబసభ్యుల అనారోగ్యం పేరుతో మధ్యంతర బెయిల్‌కు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. రాఘవ్ ఇప్పటికే బెయిల్‌పై విడుదలైనందున దాని కాలాన్ని కుదిస్తున్నామన్న సుప్రీంకోర్టు.. ఈ నెల 12న తప్పనిసరిగా స్థానిక కోర్టు ముందు హాజరుకావాలని ఆదేశాలు జారీ చేసింది.