Degree Students Hostels : హాస్టళ్ల మూసివేత.. డిగ్రీ విద్యార్థుల ఆకలి కేకలు పట్టని అధికారులు - వేసవి సెలవులు
Degree Students Hostels closed : అనంతపురం జిల్లా గుంతకల్ ఆర్డీవో కార్యాలయం ఎదుట ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో డిగ్రీ విద్యార్థులు ఖాళీ విస్తరాకులతో వినూత్న నిరసన చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు, కాలేజీలకు వేసవి సెలవులు ప్రకటించగా.. డిగ్రీ కాలేజీలు కొనసాగుతూనే ఉన్నాయి. అయినప్పటికీ జిల్లా వ్యాప్తంగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ డిగ్రీ విద్యార్థుల హాస్టళ్లను మూసివేశారు. ఈ నేపథ్యంలో పేద డిగ్రీ విద్యార్థులు వసతి, భోజనం కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విద్యార్థుల హాజరు పట్టిక మెరుగ్గా ఉండకపోతే విద్యా దీవెన అందని పరిస్థితి. అందువల్ల యూజీసీ అధికారులు తీసుకున్న నిర్ణయం పేద విద్యార్థుల పట్ల శాపంగా మారింది. వెంటనే జిల్లా స్థాయి అధికారులు స్పందించి డిగ్రీ మేనేజ్మెంట్ హాస్టళ్లను ప్రారంభించాలని స్థానిక ఆర్డీఓ రవీంద్ర కు వినతి పత్రాన్ని సమర్పించారు. హాస్టళ్లను వెంటనే తెరవకపోతే ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. 'గుంతకల్లు, గుత్తి లాంటి ప్రాంతాల నుంచి ఎంతో మంది పేద విద్యార్థులు హాస్టళ్లలో ఉంటూ విద్యనభ్యసిస్తున్నారు... కానీ, హాస్టళ్లను మూసివేయడం వల్ల వారు చదువుకు దూరమయ్యే ప్రమాదం ఏర్పడింది. ఇప్పటికైనా అధికారులు స్పందించి హాస్టళ్లను తెరిపించాలి' అని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ సభ్యుడు రమేష్ కోరారు.