Dead Bodies Change: ఆస్పత్రిలో మృతదేహాలు తారుమారు.. ఆ కారణంగానే..! - అనకాపల్లి జిల్లా లేటెస్ట్ న్యూస్
Dead Bodies Change at Hospital: అనకాపల్లి జిల్లాలోని యన్టీఆర్ ఆస్పత్రి మార్చురీలో మృతదేహాల తారుమారు ఘటన కలకలం రేపింది. ఈ నెల 11న సబ్బవరం మండలం ఆసకపల్లి వద్ద లభ్యమైన గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాన్ని పోలీసులు ఆస్పత్రికి తరలించారు. మునగపాక మండలం తోటాడకు చెందిన పాలిసెట్టి శ్రీను ఈ నెల 12న ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. శ్రీను కుటుంబసభ్యులు ఆస్పత్రికి చేరుకుని.. గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాన్ని తమ గ్రామానికి తీసుకెళ్లి ఖననం చేశారు. మార్చురీలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లేకపోవడంతో విషయాన్ని పోలీసులు.. వైద్య సిబ్బంది దృష్టికి తీసుకెళ్లారు. దీంతో జరిగిన పొరపాటును వైద్య సిబ్బంది గుర్తించారు. మృతదేహాల తారుమారు ఘటనపై విచారణ జరుపుతామని.. సిబ్బంది నిర్లక్ష్యం ఉందని తేలితే తగు చర్యలు తీసుకుంటామని ఆస్పత్రి అధికారులు తెలిపారు.
"శ్రీను అనే వ్యక్తి మతిస్థిమితం సరిగా లేకపోవటంతో గత ఐదు సంవత్సరాలుగా కుటుంబానికి దూరంగా ఉంటున్నాడు. ఈ క్రమంలో అనారోగ్యంతో బాధపడుతున్న అతడు యన్టీఆర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈ నెల 12న మృతి చెందాడు. అతడి కుటుంబసభ్యులు ఆస్పత్రికి చేరుకుని.. గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాన్ని చూసి అదే శ్రీను డెడ్‌బాడీ అనుకుని తమ గ్రామానికి తీసుకెళ్లి ఖననం చేశారు." - శ్రావణ్ కుమార్, ఆస్పత్రి సూపరింటెండెంట్