Dead bodies found in Godavari : గోదావరిలో గల్లంతైన తల్లీకూతురు మృతదేహాలు స్వాధీనం - రావులపాలెం మండలం వార్తలు
Dead bodies found in Godavari: అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెంలో గౌతమి వంతెన పైనుంచి గోదావరిలోకి... ఓ మహిళ కుటుంబాన్ని తోసేసిన ఘటనలో తల్లీకుమార్తె మృతదేహాలు లభ్యమయ్యాయి. పుర్తి వివరాల ప్రకారం.. గుంటూరు జిల్లా తాడేపల్లికి చెందిన సుహాసిని భర్తతో విడాకులు తీసుకోవడంతో ఉలవ సురేష్‌తో గత కొంతకాలంగా సహ జీవనం చేస్తోంది. ఈ వివాహేతర సంబంధాన్ని తెగదింపులు చేసుకోవాలని సురేష్ నిర్ణయించుకున్నాడు. ఇరువురి మధ్య ఏర్పడిన విభేదాలతో సుహాసిని, కీర్తన, జెర్సీలను హతమార్చాలని సురేశ్ వ్యూహం పన్నాడు. రాజమహేంద్రవరంలో దుస్తులు కొనుగోలు చేద్దామని చెప్పి కారులో సుహాసిని, ఏడాది పాప జెర్సీ, (13) సంవత్సరాల కీర్తనలను తీసుకుని వచ్చాడు. రావులపాలెం గౌతమి వంతెన వద్దకు తీసుకుని వచ్చి ఫొటో తీసుకుందామని సుహాసినికి చెప్పి ఆమెను, ఇద్దరు కుమార్తెలను వంతెన పైనుంచి గోదావరిలోకి తోసి కారులో పరారయ్యాడు. ఈ ఘటనలో 13 ఏళ్ల కీర్తన వంతెన కేబుల్ పైప్‌ను పట్టుకుని ప్రాణాలు కాపాడుకోగా.. నదిలో గల్లంతైన వారి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. కే గంగవరం మండలం పామర్రు కూళ్ల వద్ద జెర్సీ.. కోటిపల్లి వద్ద సుహాసిని మృతదేహాలు లభ్యమయ్యాయని పోలీసులు తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కొత్తపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు.