Villagers Protest for Road: 'మన రోడ్డుకు విముక్తి లేదా..' గ్రామస్థుల వినూత్న నిరసన - Protest for Road
Villagers Protest for Road: గుంటూరు జిల్లా మంగళగిరి మండలం కురగల్లులో రోడ్ల దుస్థితిపై.. గ్రామస్థులు వినూత్నంగా నిరసన చేపట్టారు. గుంతలు పడిన రోడ్డులో దిగి.. మన రోడ్డుకి విముక్తి లేదా అంటూ నినాదాలు చేశారు. రహదారులను నిర్మించాలని అనేకసార్లు మొర పెట్టుకున్నా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఇదే రహదారి గుండా.. అనేక మంది పాఠశాలలకు, కళాశాలకు వెళ్తున్నారని.. అదే విధంగా పలు భారీ వాహనాలు తిరుగుతున్నాయని అన్నారు. రోడ్డు పరిస్థితి అధ్వానంగా ఉండటం వలన.. విద్యార్థులు, పలు పనులకు వెళ్లే ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. అదే విధంగా గుంతలలో నీరు చేరడం వలన.. ప్రజలు రోగాల బారిన పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాలుగేళ్ల వైసీపీ పాలనలో కనీసం తట్టెడు మట్టి కూడా రోడ్డుకి వేయలేదని అన్నారు. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి.. కనీసం పట్టించుకోవడం లేదని విమర్శించారు. వర్షాలకు గుంతలలో నీరు చేరి.. నడవడానికి కూడా ఇబ్బందిగా ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి.. రోడ్డు వేయాలని గ్రామస్థులు కోరుతున్నారు.