Dalits Agitation: "మా బతుకులు ఆ భూములపైనే.. తీసుకుంటే ఆత్మహత్య చేసుకుంటాం": దళితుల ఆందోళన
Dalits Agitation for Land: ఎన్టీఆర్ జిల్లా వత్సవాయి మండలం భీమవరం గ్రామానికి చెందిన దళితులు ఆందోళన చేపట్టారు. పూర్వీకుల నుంచి జీవనాధారంగా వస్తున్న భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. భీమవరం కొంగర మల్లయ్యగట్టు సమీపంలో జాతీయ రహదారి పక్కన గల 12 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. దీనిని భీమవరానికి చెందిన దళితులు సాగు చేసుకుంటున్నామని తెలిపారు. ఈ భూమిలో జగనన్న కాలనీ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, టామా కేర్ సెంటర్ నిర్మాణం పేరిట ఎమ్మెల్యే సామినేని ఉదయభాను.. రెవెన్యూ, పోలీసు అధికారులతో భూములను పరిశీలించారు. అనంతరం రెవెన్యూ, పోలీస్ అధికారులు భూములను కొలతలు వేస్తుండగా దళితులు వారిని అడ్డుకోబోయారు. అడ్డుపడిన వారిపై కేసులు నమోదు చేస్తామని పోలీసులు హెచ్చరించారని బాధితులు వాపోయారు. తమ సాగు భూములను ప్రభుత్వం తీసుకునే ప్రయత్నం చేస్తే.. ఆత్మహత్య చేసుకుంటామని బాధితులు వాపోయారు. దీనిపై ఉన్నతాధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు..