Dalit couple protest: భూమి లాక్కున్నారు.. వైసీపీ నాయకుల తీరుపై దంపతుల ఆగ్రహం
Dalit couple protest: తనకు కేటాయించిన భూమిలో వైసీపీ నాయకులు సాగు చేసుకుంటున్నా తహసీల్దార్ పట్టించుకోవడం లేదని దళిత వర్గానికి చెందిన ఓబన్న అనే రైతు ఆందోళన వ్యక్తం చేశారు. తనకు న్యాయం చేయాలంటూ అనంతపురం జిల్లా యాడికి మండలంలోని తహసీల్దార్ కార్యాలయం పైకెక్కి ఆందోళన వ్యక్తం చేశారు. దళిత వర్గానికి చెందిన దంపతులు ఓబన్న, రత్నకుమారి.. తమకు కేటాయించిన పొలాన్ని తమకు ఇవ్వాలని.. లేకపోతే ఆత్మహత్యే శరణ్యమని తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. యాడికి మండలం కోనప్పలపాడు ప్రాంతానికి చెందిన ఓబన్నకు 2020లో ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ కింద ప్రభుత్వం ఐదు ఎకరాల భూమి కేటాయించింది. ఈ భూమిలో ప్రస్తుతం వైసీపీకి చెందిన నాయకులు రాత్రికి రాత్రి చీని మొక్కలు నాటి.. పొలం తమదేనని చెప్పుకొచ్చారు. పొలం వద్దకు వెళ్లిన రైతు దంపతులను వైసీపీ నాయకులు బెదిరించినట్లు దంపతులిద్దరూ వాపోయారు. సమస్యను చెప్పుకోవడానికి తహసీల్దార్ కార్యాలయానికి వస్తే.. అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తహసీల్దార్ మాత్రం ఈ భూమి ప్రభుత్వానికి చెందుతుందని.. నోటీసులు జారీ చేశామని చెబుతున్నారు. నోటీసులు జారీ చేస్తే.. రాత్రి చీని మొక్కలు ఎలా నాటుతారని రైతు ఓబన్న ప్రశ్నించారు. అధికారులు తమకు న్యాయం చేసేలా చర్యలు తీసుకోవాలని రైతు దంపతులు కోరుతున్నారు.