Drunk and Drive గుడివాడలో పోలీసుల అత్యుత్సాహం.. డ్రంకన్ డ్రైవ్‌లో వాహనం స్వాధీనంతో వ్యక్తి ఆత్మహత్య - కృష్ణ జిల్లాలో పోలీసు కేసులకు భయపడి ఆత్మహత్య
suicide due to police overaction పోలీసుల అత్యుత్సాహంతో కృష్ణాజిల్లా గుడివాడలో ఓ కార్మికుడు ఆత్మహత్య చేసుకుని మృతి చెందాడు. కాకర్ల వీధిలో మధ్యాహ్నం పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో మద్యం సేవించి వాహనం నడుపుతున్న తాపీ కార్మికుడు ఒర్సు ఏడుకొండలు అనే వ్యక్తిని అపి బ్రీత్ ఎనలైజర్‌తో పరీక్షించారు. పట్ట పగలు మద్యం సేవించి వాహనం నడుపుతావా అంటూ.. పోలీసులు ఏడుకొండల్ని మందలించారు. వాహనం లాక్కొన్న పోలీసులు ఫైన్ కట్టి తీసుకెళ్లమని చెప్పారు. పోలీసుల చర్యలతో తీవ్ర మనస్థాపానికి గురైన ఏడుకొండలు తన ఇంటి వద్ద ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. హనుమత్ జయంతి పండగ కావడంతో తన అనుమతితోనే భర్త ఏడుకొండలు మద్యం సేవించడానికి వెళ్ళాడని ఏడుకొండలు భార్య నర్సాలు తెలిపింది. ఇంటికి వచ్చిన తర్వాత పోలీసులు బండి లాక్కున్నారని ఏడుకొండలు కలత చెందినట్లు ఆమె వెల్లడించింది. అనంతరం ఇంట్లోనే ఆత్మహత్య చేసుకున్నాడని నర్సాలు ఆవేదన వ్యక్తం చేసింది. పోలీసుల చర్యతో ఆత్మహత్య చేసుకున్న ఏడుకొండలు కుటుంబానికి న్యాయం చేయాలని ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు.