Cyber Fraud With Fake Fingerprints: నకిలీ వేలిముద్రలతో రూ.6 కోట్లు కాజేసిన ముఠా అరెస్టు - సైబర్ నేరగాళ్ల కడప ఎస్పీ అన్బురాజన్ అరెస్ట్ చేశారు
Cyber Fraud With Fake Fingerprints :నకిలీ వేలిముద్రలు, ఆధార్ కార్డులు సృష్టించి ప్రజల బ్యాంకు ఖాతాల నుంచి కోట్ల రూపాయలను కాజేసిన ఐదుగురు అంతరాష్ట్ర ముఠా సభ్యులను వైఎస్సార్ జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. ఈ సైబర్ నేరగాళ్లు 5 ప్రముఖ బ్యాంకులకు సంబంధించిన 12 ఖాతాల నుంచి దాదాపు 6 కోట్ల రూపాయలు కాజేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. గుంటూరు, ప్రకాశం జిల్లాలకు చెందిన ఐదుగురు (Fake Fingerprints scam) సైబర్ నేరగాళ్లపై 416 పిటిషన్లు ఎన్సీఆర్బీ పోర్టల్లో నమోదు అయ్యాయని జిల్లా ఎస్పీ అన్బురాజన్ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 416 మంది బాధితులు ఉంటే వైఎస్సార్ జిల్లా నుంచి 60 మంది ఉన్నట్లు ఎస్పీ వెల్లడించారు. ఆధార్ కార్డుకు అనుసంధానంగా ఉన్న వేలిముద్రలను.. నిందితులు ఓ యంత్రం ద్వారా నకిలీ వేలిముద్రలు తయారు చేసి ప్రజలను మోసం చేస్తున్నట్లు గుర్తించామని ఆయన పేర్కొన్నారు. నిందితులు కాజేసిన 6 కోట్ల రూపాయల బ్యాంకు లావాదేవీలకు సంబంధించిన వివరాలను ఈడీ, ఐటీ సంస్థలకు అందజేస్తామని తెలిపారు. బ్యాంకు ఖాతాల నుంచి వారికి తెలియకుండానే నగదు మాయమవుతున్నట్లు అనుమానం వస్తే పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఎస్పీ విజ్ఞప్తి చేశారు.