CS Reviews On Employees Housing and Health: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు.. అధికారులతో సీఎస్ సమీక్ష - పట్టణ ప్రాంతాల్లో గృహనిర్మాణాలు
CS Reviews On Employees Housing and Health: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు ఇచ్చే అంశంపై సీఎస్ జవహర్ రెడ్డి సీసీఎల్ఏ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఉద్యోగ సంఘాల హౌసింగ్ సొసైటీల వారీగా ఇళ్ల స్థలాలకు ఎంత మేర భూమి అవసరం ఉందో పరిశీలించాలని సీఎస్ సూచించారు. ఈ విషయంపై ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో చర్చించి ఒక నివేదిక సమర్పించాలని ఆదేశించారు. పది రోజుల్లో ఉద్యోగుల ఇళ్ల స్థలాల అంశం పై సీఎం సమీక్ష నిర్వహించనున్నారని తెలిపారు. పట్టణ ప్రాంతాల్లో పబ్లిక్ హౌసింగ్ విధానాన్ని తీసుకు వచ్చే అంశంపై దృష్టి సారించాలని అధికారులకు సూచించారు. పట్టణ ప్రాంతాల్లో ఇళ్లు లేనివారు, ఇళ్లు ఉన్నా రోడ్లు, పుట్ పాత్లు, కాలువలు, డ్రైన్లు వంటి వివిధ ప్రభుత్వ స్థలాలను ఆక్రమించుకుని గుడిసెలు నిర్మించుకునే వారికి పబ్లిక్ హౌసింగ్ విధానంలో ఇళ్లను నిర్మించేందుకు అస్కారం ఉందని తెలిపారు. దీనిపై అన్ని పట్టణాల్లో పరిశీలన చేసి ముఖ్యమంత్రి సమావేశం నాటికి నివేదికను సిద్ధం చేయాలని స్పష్టం చేశారు.మరోవైపు ఉద్యోగుల ఆరోగ్య పథకం ఈహెచ్ఎస్ పైనా సీఎస్ ఆరోగ్యశాఖ అధికారులతో సమీక్షించారు. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు ఈహెచ్ఎస్ అమలుకు చర్యలు చేపట్టినట్టు అధికారులు వివరించారు. అటు మెడికల్ రీయింబర్స్మెంట్ అంశంపైనా కార్యాచరణ చేసినట్టు స్పష్టం చేశారు.