విజయవాడలో సీపీఎం ప్రజా రక్షణ భేరి జాతాలు
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 4, 2023, 12:24 PM IST
CPM Political Bureau Member Fires on BJP,YCP : ప్రజా హక్కులను, ప్రజాస్వామ్య విధానాన్ని, రాజ్యాంగ విలువలను.. దేశంలో బీజేపీ, రాష్ట్రంలో వైసీపీ నాశనం చేస్తున్నాయని సీపీఎం పోలిట్ బ్యూరో సభ్యులు బీవీ.రాఘవులు మండిపడ్డారు. ఎస్సీ,ఎస్టీల హక్కులు హరిస్తూ రాష్ట్రంలో వైసీపీ సామాజిక సాధికార బస్సు యాత్ర చెయ్యడం హాస్యాస్పదమని ధ్వజమెత్తారు.
Praja Rakshana Bheri : భారత దేశంలో రాజ్యాంగం అమలులోకి వచ్చిన నవంబర్ 26 తేదీన విజయవాడ స్వరాజ్ మైదానంలో భారీ అంబేడ్కర్ విగ్రహాన్ని ప్రారంభిస్తున్నట్లు వైసీపీ తెలిపింది. ఈ విగ్రహాన్ని ఆవిష్కరించే అర్హత వైసీపీ కి లేదని రాఘవులు మండిపడ్డారు. రాజ్యంగం, ప్రజాస్వామ్యం, లౌకిక వాదాన్ని తుంగలో తొక్కుతున్న బీజేపీకి అడుగడుగున వైసీపీ మద్దతు తెలుపుతుందని దుయ్యబట్టారు.కేంద్ర ప్రభుత్వం ప్రజా హక్కులను కాలరాస్తుందని మండిపడ్డారు.
ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టడానికి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా రక్షణ భేరి పేరుతో సీపీఎం జాతాలు(meeting) నిర్వహిస్తున్నామన్నారు.అక్టోబరు 29వ తేదీ నుంచి జాతాలు ప్రారంభమయ్యయని, మూడు ప్రాంతాల నుంచి ముఖ్యమైన నాయకులతో నిర్వహిస్తున్నామన్నారు. నవంబరు 15న విజయవాడలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. తమకు రాజకీయంగా స్పష్టమైన వైఖరి ఉందని....బీజేపీని వ్యతిరేకించే పార్టీలు, శక్తులతో కలిసి పని చేస్తామని రాఘవులు ప్రకటించారు. వామపక్షాలు కలిసి ఉమ్మడిగా రాష్ట్రంలో పోటీ చెయ్యడానికి కృషి చేస్తామంటున్నారు.