'రాష్ట్రంలో కరెంటు కన్నా వేగంగా మత్తు పదార్థాల మాఫియా విస్తరిస్తోంది'
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 23, 2023, 4:47 PM IST
CPM Fired on Drugs in AP: ఏపీ డ్రగ్స్, గంజాయికి స్థావరంగా మారిందని సీపీఎం నాయకులు దుయ్యబట్టారు. చివరకు పాఠశాలల స్థాయి వరకు మత్తుపదార్థాల వినియోగం వ్యాపించిందని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో గంజాయి, డ్రగ్స్ ఎక్కడ పట్టుబడినా ఏపీతో సంబంధాలు ఉంటున్నాయని విమర్శించారు. ఇంతా జరుగుతున్నా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోకపోవడం దారుణమని మండిపడ్డారు. కాంట్రాక్టుల కోసమే సాగునీటి ప్రాజెక్టులు నిర్మిస్తే తీవ్ర నష్టం వాటిల్లుతుందని విమర్శించారు. పోలవరం ప్రాజెక్టు ఏళ్లు గడుస్తున్నా నేటికీ పూర్తికాకపోవడానికి పాలకుల ప్రణాళిక లోపమే కారణమని ఆరోపించారు. పాలస్తీనా-ఇజ్రాయిల్ దేశాధినేతలతో చర్చించి ఇరుదేశాల్లో శాంతి స్థాపన కోసం ప్రధాని మోదీ ప్రయత్నించాలని కోరారు. అమాయాకులు చనిపోకుండా ఉండాలంటే యుద్ధం ఆపాలని అన్నారు.
కరెంటు కన్నా వేగంగా మత్తు పదార్థాల మాఫియా రాష్ట్రంలో విస్తరిస్తోందని మండిపడ్డారు. పోలీసులు దీనిపై ఎన్ని క్యాంపులు నిర్వహించినా, ఎంత ప్రచారం చేసినా ఆగలేదని.. ఇంకా పెరుగుతోందని ఆరోపించారు. తాజాగా ఒంగోలులో కళాశాల విద్యార్థులు దాడులు చేసుకున్నారని గుర్తు చేశారు. రాబోయే తరాలను నిస్సత్తువ తరాలను, పనికిరాని తరాలను పాలకులు తయారు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.