'అధికారుల అవినీతికి ముఖ్యమంత్రే కారణం - సీఎం పర్యటన ఖర్చులు అధికారులకేం సంబంధం?' - విజయవాడ తాజా వార్తలు
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 25, 2023, 3:25 PM IST
CPI State Secretary K. Ramakrishna on MRO Suspension : అధికారుల అవినీతికి ముఖ్యమంత్రి, మంత్రులే కారకులని, దీనికి వారే నైతిక బాధ్యత వహించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ మండిపడ్డారు. ఈ మేరకు కె.రామకృష్ణ ఒక ప్రకటన విడుదల చేశారు. సాక్షాత్తూ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి లిక్కర్, మైనింగ్, ఇసుక అమ్మకాల ద్వారా వచ్చిన కోట్లాది రూపాయల సొమ్మును తాడేపల్లి ప్యాలెస్‌కు తరలించినట్లు ఆరోపణలు గుప్పుమంటుంటే, మరోపక్క ముఖ్యమంత్రి, మంత్రులు, అధికారుల పర్యటనలకయ్యే ఖర్చులను క్రిందిస్థాయి అధికారులు, సిబ్బంది సమకూర్చాలంటూ ఒత్తిడి పెంచడం అవినీతికి ఆస్కారమివ్వడమే అన్నారు.
CPI State Secretary :మడకశిర తహసీల్దారుని అవినీతికి పాల్పడ్డాడని సస్పెండ్ చేయడంతో సమస్య పరిష్కారం జరిగినట్లు అధికారులు భావిస్తున్నారన్నారు. వాస్తవానికి ఆ తహసీల్దార్ ఉన్నది ఉన్నట్లుగా చెప్పారన్నారు. తమ పై అధికారులు, మంత్రులు ఆయా జిల్లాల్లో, మండలాల్లో పర్యటించినప్పుడు అందుకయ్యే ఖర్చులు క్రిందిస్థాయి అధికారులే భరించాల్సిన దుస్థితే అందుకు కారణమన్నారు. మంత్రులు, అధికారులు పర్యటనల సందర్భంగా సభలు, సమావేశాలకు, భోజన, వసతులు, జన సమీకరణలకు అయ్యే తదితర ఖర్చులను ప్రభుత్వం చెల్లించడం లేదన్నారు. దీంతో కొందరు అధికారులు తమ స్వంతంగా అప్పులు తెచ్చి పెట్టలేక, అవినీతికి పాల్పడుతున్నారన్నారు.