Ramakrishna about Amara Raja: 'పరిశ్రమలు తీసుకురాకపోగా.. ఉన్నవాటిని వెళ్లగొడుతున్నారు' - సీఎం జగన్పై సీపీఐ రామకృష్ణ కామెంట్స్
CPI Ramakrishna about Amara Raja: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కక్షపూరిత వైఖరి కారణంగా అమరరాజా కంపెనీ రాష్ట్రం నుంచి తెలంగాణకు వెళ్లిపోయిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. చిత్తూరు జిల్లాలో ఎంతోమందికి ఉపాధి కల్పించిన అమరరాజా సంస్థను ప్రభుత్వం వేధింపులకు గురి చేయడం వల్లే 9వేల 500 కోట్ల విలువైన ప్రాజెక్ట్ పక్క రాష్ట్రానికి పోయిందన్నారు. అమరరాజా సంస్థ పట్ల ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కక్షపూరిత ధోరణితో వ్యవహరించారని ఆరోపించారు.
ఇప్పటికే రాయలసీమలో ఏర్పాటు చేసిన కియా పరిశ్రమ యొక్క అనుబంధ పరిశ్రమలు వలస వెళ్లిపోయాయన్నారు. జాకీ పరిశ్రమను వెళ్లగొట్టారని అన్నారు. ఇప్పుడు అమరరాజా కంపెనీని వేధించి రాష్ట్రం నుంచి వెళ్లిపోయేలా చేశారని మండిపడ్డారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఒక్క పరిశ్రమ కూడా రాష్ట్రానికి రాలేదన్నారు. పరిశ్రమలు తీసుకురాకపోగా.. ఉద్యోగాలను కల్పించలేకపోగా.. ఉన్న పరిశ్రమలను వెళ్లగొట్టడం సరికాదని తెలిపారు. అమరరాజా కంపెనీ తెలంగాణ రాష్ట్రానికి వలస వెళ్లడం వెనుక పూర్తిగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కారణమన్నారు.