ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి రైతులకు న్యాయం జరిగేలా చూస్తాం: రామకృష్ణ
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 8, 2023, 6:03 PM IST
CPI Secretary Ramakrishna Visited Michaung Affected Area: విజయవాడలో మిగ్జాం తుఫాన్ ప్రభావంతో నష్టపోయిన పంటలను శుక్రవారం సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ పరిశీలించారు. కరువుతో తీవ్ర అవస్థలు పడి పండించిన కాస్త పంటైనా చేతికి రాకుండా పోయిందని రామకృష్ణతో రైతులు మొర పెట్టుకున్నారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ పంట నష్టపోయిన రైతాంగాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలని డిమాండ్ చేశారు. వరికి 25వేల రూపాయలు, ఉద్యాన పంటలకు 50వేల రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని కోరారు.
Government Provide Compensation To Farmers:విజయవాడలో పర్యటించినరామకృష్ణ బాధిత రైతాంగాన్ని పరామర్శించి పంట నష్టం వివరాలు తెలుసుకున్నారు. రాష్ట్రంలో కనీవినీ ఎరుగని విపత్తు సంభవించి రైతులకు భారీ నష్టాన్ని కలిగించిందని పేర్కొన్నారు. రైతాంగాన్ని ఆదుకోవడంలో ప్రభుత్వం అలసత్వం ప్రదర్శిస్తే రైతులతో కలిసి ఉద్యమిస్తామని హెచ్చరించారు. ప్రభుత్వం రైతుల నుంచి ధాన్యం సరిగ్గా కొనుగోలు చేయడం లేదని మండిపడ్డారు. రైతులందరూ వైసీపీ ప్రభుత్వంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని రామకృష్ణ తెలిపారు. తుపాను నష్టాలు, రైతుల కరువు కష్టాలు గురించి రేపు రాజకీయ పార్టీలన్నీ కలిసి సమావేశం నిర్వహించి పరిష్కారంపై చర్చిస్తామని తెలిపారు. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి రైతులకు న్యాయం జరిగేలా చూస్తామని స్పష్టం చేశారు.