CPI Ramakrishna on Chandrababu Arrest: చంద్రబాబు అరెస్ట్.. రేపు విజయవాడలో అన్ని పక్షాలతో సమావేశం: రామకృష్ణ
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 10, 2023, 3:33 PM IST
CPI Ramakrishna on Chandrababu Arrest: తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని సీఐడీ అధికారులు అరెస్ట్ చేయడంపై.. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి అనుకూలంగా పని చేయటానికి పోలీసులు, సీఐడీ వ్యవహరిస్తుందని ఆరోపించారు. కక్ష సాధింపు రాజకీయాలకు ఆంధ్రప్రదేశ్ ఓ వేదికగా మారిందని రామకృష్ణ దుయ్యబట్టారు.
CPI Ramakrishna Comments: ''ఆంధ్రప్రదేశ్ సీఐడీ పేరును జేపీఎస్ (జగన్ ప్రైవేట్ సైన్యం)గా మారిస్తే బాగుంటుంది. ఎందుకంటే జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత సీఐడీ.. జగన్ ప్రైవేట్ సైన్యంగా పని చేస్తోంది. ప్రతిపక్షాల పట్ల పోలీసులు, సీఐడీ వ్యవహరిస్తున్న తీరును బట్టే చూస్తే.. వాళ్లంతా ప్రభుత్వానికి ఎంత అనుకూలంగా పని చేస్తున్నారో చాలా స్పష్టంగా అర్ధమవుతుంది. పోలీసుల రాజ్యంలో ప్రజాస్వామ్య విలువలు పతనం అవుతున్నాయి. కాబట్టి హక్కుల సంఘాలు, ప్రజా సంఘాలు ముందుకు రావాలి. రేపు విజయవాడలో అన్ని పక్షాలతో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేస్తున్నాం. రౌండ్ టేబుల్ సమావేశం అనంతరం చంద్రబాబు నాయుడిని కలిసి సంఘీభావం తెలుపుతాం'' అని తిరుపతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పిలుపునిచ్చారు.