ప్రభుత్వం కార్మికుల సమస్యలు పరిష్కరించాలి: సీపీఐ రామకృష్ణ
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 2, 2024, 8:48 PM IST
CPI Ramakrishna Fires on YCP Government:రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు ఆందోళనలో ఉన్నారని ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ అంగన్‌వాడీ, మున్సిపల్ కార్మికులు సమ్మె చేపట్టారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ అన్నారు. అతి తక్కువ వేతనాలతో పనిచేస్తున్న వారి సమస్యలు పరిష్కరించకపోవడంతో వాళ్లు సమ్మెకు వెళ్లారని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు చేసిన అప్పులతో పోల్చితే కార్మికులకు ఇవ్వాల్సింది చాలా స్వల్పమన్నారు. సమస్యలను పరిష్కరించాలని కలెక్టరేట్ల వద్ద సమ్మె చేపట్టిన అంగన్వాడీలకు సీపీఐ మద్దతు తెలుపుతుందని పేర్కొన్నారు.
విజయవాడ దాసరి భవన్లో నిర్వహించిన సమావేశంలో రామకృష్ణ మాట్లాడుతూ రాష్ట్రంలో పెద్ద ఎత్తున దోపిడీ జరుగుతోందని మండిపడ్డారు. బైజుస్ కంపెనీ ప్రస్తుతం మనీ లాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటోందని అటువంటి కంపెనీతో జగన్ ప్రభుత్వం ఎలా ఒప్పందం చేసుకుంటుందని రామకృష్ణ ప్రశ్నించారు. బైజుస్ సెంటర్ల వద్ద సీపీఐ నిరసన చేపడుతుందని వెల్లడించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరికి ప్రభుత్వ అవినీతిపై లేఖ రాసి మూడు నెలలు అయిందని తెలిపారు. ఇంత వరకు ఎలాంటి స్పందన లేదని రామకృష్ణ అన్నారు. బీజేపీ, వైసీపీ మధ్య పొత్తు ఉండటం వల్లే నేటి వరకు ఆ లేఖపై కేంద్రం స్పందించలేదని ఆయన విమర్శించారు.