CPI Ramakrishna: మోటర్లకు స్మార్ట్ మీటర్లు బిగిస్తే.. రైతులు అన్యాయమైపోతారు: సీపీఐ రామకృష్ణ - తెలుగు బ్రేకింగ్ న్యూస్
CPI Ramakrishna on Smart Meters : రాష్ట్రంలో వ్యవసాయ రంగంలోని మోటర్లకు స్మార్ట్ మీటర్లు బిగించటం అత్యంత దారుణమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. స్మార్ట్ మీటర్లు బిగిస్తే రైతులు తీవ్ర అన్యాయమైపోతారని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంలో సీపీఐ రాష్ట్ర శిక్షణ తరగతులను నిర్వహించగా.. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ హాజరయ్యారు. హంద్రీనీవా కాలువను వెడల్పు చేసి నీటి సామర్థాన్ని పెంచుతామని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారని గుర్తు చేశారు. అధికారం చేపట్టి నాలుగు సంవత్సరాలు పూర్తి కావస్తున్నా హంద్రీనీవాఊసే ఎత్తలేదని విమర్శించారు. మోటార్లకు స్మార్ట్ మీటర్లు బిగించడంపై అన్ని పార్టీలతో కలిసి.. రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడతామని అన్నారు. మోటార్లకు స్మార్ట్ మీటర్లు బిగిస్తే రైతులు అన్యాయమై పోతారన్నారు. సీఎం జగన్ ముందస్తు ఎన్నికలకు వెళ్తే ప్రజలకు వైసీపీ పాలన నుంచి త్వరలోనే విముక్తి కలుగుతుందని రామకృష్ణ చెప్పారు.