CPI Ramakrishna Fire on Amit Shah: 'సీబీఐ దద్దమ్మలా తయారైంది.. బీజేపీ అన్ని రంగాలలో విఫలమైంది' - Ramakrishna key comments on CBI and Amit Shah
CPI Ramakrishna key comments on CBI and Amit Shah: ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన నాలుగేళ్లలో జగన్ ప్రభుత్వం అవినీతి, కుంభకోణాలు తప్పితే మరేమీ చేయలేదని.. జగన్ పాలనలో విశాఖపట్నాన్ని అరాచక శక్తులకు అడ్డాగా మార్చేశారంటూ.. భారతీయ జనతా పార్టీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. నిన్న విశాఖ రైల్వే మైదానంలో జరిగిన బహిరంగ సభలో ఘాటు వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఆ (అమిత్ షా) వ్యాఖ్యలపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో అంతా అవినీతి జరిగితే.. కేంద్ర హోం మంత్రిగా మీరేం చేస్తున్నారంటూ ఆయన ప్రశ్నించారు.
బీజేపీ అన్ని రంగాలలో విఫలమైంది.. విజయవాడలోని సీపీఐ కార్యాలయంలో ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ ఈరోజు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ 9 ఏళ్ల పాలన.. అన్ని రంగాలలో విఫలమైందని.. ఆదానీ, అంబానీలు లబ్ది పొందారే తప్ప.. పేదలకు ఎటువంటి లబ్ది చేకూరలేదని ఆయన విమర్శించారు. నల్లధనం వెలికితీస్తామన్నారు.. ఏమి తీయలేదు..? తాజాగా రెండు వేల నోట్లను రద్దు చేశారు..? ఆ రద్దుతో ఒరిగింది ఏమి లేదంటూ రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు.
సీబీఐ దద్దమ్మలా తయారైంది: కేంద్ర హూంమంత్రి అమిత్ షా.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏమి ఇచ్చారో ఒక్కటి కూడా చెప్పలేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ వ్యాఖ్యానించారు. ''నాలుగేళ్లుగా జగన్.. రాష్ట్ర రాజధాని విషయంలో మూడు ముక్కలాట ఆడుతుంటే, అప్పుడు ఏం మాట్లాడకుండా.. ఇప్పుడు రాజధాని లేని రాష్ట్రంగా ఏపీ ఉందని ఎలా మాట్లాడుతారు..? రాష్ట్రంలో అవినీతి జరుగుతుంటే కేంద్ర హోం మంత్రిగా ఉండి మీరేం చేస్తున్నారు..? దిల్లీలో కనిపించిన కుంభకోణాలు ఈ రాష్ట్రంలో కనిపించలేదా..? కేంద్ర దర్యాప్తు సంస్థ అయినటువంటి సీబీఐ.. ఒక ఎంపీని అరెస్ట్ చేయలేని దద్దమ్మలా తయారైంది. దీనికి అమిత్ షా కారణం కాదా..? ఆయన చేతిలోనే సీబీఐ ఉంది. రైతులకు ఎనలేని సాయం చేశామని చెబుతున్న అమిత్ షా.. స్వామినాథన్ సిఫార్సు ప్రకారం.. మద్దతు ధరలు ఇస్తున్నారా..? భారతదేశ చరిత్రలో ఇంతగా వైఫల్యం చెందిన ప్రభుత్వం మరొకటి లేదు. రాష్ట్రంలో జగన్, బీజేపీ కలిసే అన్ని ప్రభుత్వ ఆస్తులు కార్పొరేట్లకు దోచి పెడుతున్నారన్నారు'' అని ఆయన అన్నారు.