CPI Ramakrishna: "విద్యారంగాన్ని గాలికొదిలేసి.. సర్వనాశనం చేశారు" - పాఠశాల విద్యపై సీపీఐ రామకృష్ణ వ్యాఖ్యలు
CPI Ramakrishna on Education System in AP: వైసీపీ ప్రభుత్వం విద్యావ్యవస్థను నాశనం చేసిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. ప్రభుత్వం ఓ వైపు నాడు నేడు అని గొప్పగా ప్రచారం చేసుకుంటోందని.. మరో వైపు ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థుల సంఖ్య తగ్గిపోతున్నా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. రాష్ట్రంలోని దాదాపు 9వేల ప్రభుత్వ పాఠశాలల్లో ఒక్కో ఉపాధ్యాయుడు మాత్రమే ఉన్నారని అన్నారు. గడిచిన 9నెలల్లో సుమారు ఆరున్నర లక్షల మంది విద్యార్థులు.. ప్రభుత్వ పాఠశాలల నుంచి వెళ్లిపోయారన్నారు. దాదాపు 4వేల ప్రాథమిక పాఠశాలలను ఇతర పాఠశాలల్లో విలీనం చేశారని ఆరోపించారు. పాఠశాల విద్యా వ్యవస్థను మాత్రమే కాకుండా.. ఉన్నత విద్యా వ్యవస్థను కూడా రాష్ట్ర ప్రభుత్వం నాశనం చేసిందని మండిపడ్డారు. వర్శిటీలకు వీసీలుగా ముఖ్యమంత్రి భజనపరులను నియమించారని ఆరోపించారు. చాలా వరకు అధ్యాపకుల పోస్టులు ఖాళీగా ఉన్నాయని.. పాఠశాల, ఉన్నత స్థాయి విద్యార్థులిద్దరూ ప్రభుత్వ నిర్వాకం వల్ల నష్టపోయేలా ఉన్నారని అన్నారు. దీనిబట్టి చూస్తే విద్యారంగాన్ని గాలికొదిలేసి సర్వనాశనం చేశారని విమర్శించారు.