CPI Narayana: రజనీకాంత్‌పై వైసీపీ నేతల విమర్శలు విడ్డూరం: నారాయణ
CPI narayana : సినీనటుడు రజనీకాంత్ అభిప్రాయం చెబితే ఆయనపై వైఎస్సార్సీపీ నేతలు విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. తిరుపతిలోని పార్టీ కార్యాలయంలో మేడే సందర్బంగా ఆయన ఎర్ర జెండాను ఆవిష్కరించారు. అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ వైఎస్సార్సీపీ నాయకులు వీధి, జేబు దొంగల్లా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. వీధి రౌడీలకు వైఎస్సార్సీపీ కార్యకర్తలకు పెద్ద తేడా లేకుండా పోయిందన్నారు. ఊరికి నలుగురు దత్తపుత్రులతో జగన్ అరాచకం చేస్తున్నాడని విమర్శించారు. ఆదిరెడ్డి భవాని కుటుంబంపై జగన్ కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.
రాజమండ్రి ఎమ్మెల్యే భవానీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పాల్గొనకుండా అధికార పార్టీ నేతలు భయభ్రాంతులకు గురిచేశారు. ఆమె భయంతో ఇల్లు విడిచి బయటకు వెళ్లకపోవడంతో టీడీపీ నేత అచ్చెన్నాయుడు తెలుసుకుని ఇంటికి వచ్చి తీసుకెళ్లారు. ఆ ఓటు పడడంతోనే టీడీపీ గెలిచింది. ఆ కక్షతోనే ఆమె భర్తను అరెస్టు చేయించారు. కేంద్రంలో మోదీ తన వ్యతిరేకులను జైళ్లలో పెడుతుంటే.. రాష్ట్రంలో జగన్ మోదీని తలపిస్తున్నాడు. ఉద్యోగులకు సకాలంలో జీతాలు ఇవ్వడం లేదు. రజనీ కాంత్‌కు రాజకీయ ఉద్దేశాలు ఏమీ లేవు. తన అభిప్రాయాన్ని వెల్లడిస్తే ఆయనపై అవాకులు, చవాకులు మాట్లాడడం తగదు. వీధిలో జేబులు కొట్టే వాళ్లు.. పిక్ పాకెటర్స్ రజనీకాంత్ గురించి మాట్లాడడం నవ్వు తెప్పిస్తోంది.- నారాయణ, సీపీఐ జాతీయ కార్యదర్శి