CPI Narayana On Pawan Kalyan: 'పవన్ కల్యాణ్ ఎన్డీఏతో కలవడం బాధాకరం' - పవన్ కల్యాణ్ పై నారాయణ వ్యాఖ్యలు
CPI Narayana on Pawan Kalyan attending NDA Meeting : జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎన్డీఎతో కలిసి నడవడం సరికాదని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. చెగువెరా నుంచి సావర్కర్ వైపు పవన్ ప్రయాణం సాగడం బాధాకరమని ఆయన అన్నారు. గతంలో విప్లవ వీరుడు చెగువేరా టీ షర్టులు వేసుకుని సోషలిజంపైన గళం విప్పిన పవన్ కల్యాణ్.. ఇప్పుడు మితవాద సంస్కరణల సావర్కార్ వైపు దారి తప్పి నడవడం సరికాదని హితవు పలికారు. ప్రజాస్వామ్యానికి, లౌకిక వాదానికి ప్రమాదకరమైన బీజేపీతో జట్టు కడితే పవన్ కల్యాణ్‌ను కూడా సముద్రంలో కలిపేస్తారని హెచ్చరించారు. బీజేపీ దేశంలో ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తుందని, రాజకీయ నాయకులపై సీబీఐ, ఎన్ఫోర్స్ డిపార్ట్మెంట్ సంస్థలతో దాడులు చేయిస్తున్న బీజేపీకి మద్దతు పలకడం సరైనా పద్దతి కాదని ఆయన అన్నారు. అలాగే బీజేపీ, టీడీపీకి మధ్యవర్తిత్వం చేయడం రాజకీయాలకు మంచిది కాదని ఆయన అన్నారు. మొత్తానికి పవన్ కల్యాణ్ ప్రవర్తిస్తున్న తీరు చాలా దురదృష్టకరమని నారాయణ తెలిపారు.