Couple protest: 'ఎమ్మెల్యే అనుచరుడి నుంచి ప్రాణహాని.. మాకు న్యాయం చేయండి' - కేసరపల్లి లేటెస్ట్ న్యూస్
Couple protest: కృష్ణా జిల్లా గన్నవరం మండలంలో దంపతుల ధర్నా చర్చనీయాంశంగా మారింది. ఎమ్మెల్యే వంశీమోహన్ అనుచరుడి వల్ల తమకు ప్రాణహాని ఉందంటూ బుధవారం నిరసనలు చేపట్టారు. జిల్లాలోని కేసరపల్లికి చెందిన పల్లపోతు గంగరాజు, దుర్గాకల్యాణి దంపతులు.. ఎమ్మెల్యే వంశీమోహన్ అనుచరుడు, గన్నవరం మాజీ ఎంపీపీ పొట్లూరి బసవరావుతో ప్రాణహాని ఉందంటూ నిరసనకు దిగారు. ఆ దంపతులు 2017 సంవత్సరంలో కొనుగోలు చేసిన 94 సెంట్ల స్థలాన్ని కబ్జాకు పాల్పడి.. చంపేస్తానంటూ బెదిరింపులకు దిగుతున్నాడని ఆరోపించారు. 2022లో నకిలీ పత్రాలు సృష్టించి.. అది తన స్థలం అని గతకొంత కాలంగా బసవరావు దౌర్జన్యం చేస్తున్నారని తెలిపారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా.. పోలీసులు పట్టించుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అతడిపై స్థానికంగా శ్మశానం, ప్రభుత్వ భూములు కబ్జాకు పాల్పడినట్లు పలు ఆరోపణలు కూడా ఉన్నాయని ఆరోపించారు. అధికారులు దీనిపై స్పందించి కబ్జాకు పాల్పడి బెదిరింపులకు దిగుతున్న బసవరావు నుంచి తమ స్థలాన్ని ఇప్పించి న్యాయం చేయాలని బాధితులు వేడుకుంటున్నారు.