అతడిని విడవలేక ఆమె - ఆమెతో ఉండలేక అతడు - క్రైం న్యూస్
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 14, 2024, 8:53 PM IST
Couple in a relationship commits suicide: ఆమెకు పెళ్లై ఇద్దరు పిల్లలున్నారు. భర్త నుంచి విడాకులు తీసుకొని వేరుగా ఉంటుంది. అతనికి ఇంకా పెళ్లి కాలేదు. పెళ్లి చేసుకోవాలనే ప్రయత్నాల్లో ఉన్నాడు. కానీ ఆ ఇద్దరు ఈ రోజు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన వైఎస్ఆర్ కడప జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం
రైలు కిందపడి ఓ వివాహిత, మరో యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన కడప రైల్వే స్టేషన్‌లో చోటు చేసుకుంది. స్థానిక రవీంద్ర నగర్‌కు చెందిన పాలకొండ రాయుడు, నెహ్రూనగర్‌కు చెందిన చందనా రెడ్డితో ఏడు నెలలుగా సహజీవనం చేస్తున్నాడు. పాలకొండ రాయుడు ఆరోగ్యశ్రీలో డేటా ఎంట్రీ ఆపరేటర్‌గా పని చేస్తున్నాడు. చందనా రెడ్డికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. భర్తతో విడాకుల తర్వాత వీరి మధ్య పరిచయం ఏర్పడింది. రెండు నెలలుగా మనస్పర్దలు మొదలయ్యాయి. 15 రోజులుగా పోలీస్‌స్టేషన్‌లో పంచాయతీ జరుగుతున్న తరుణంలో రాయుడు రెండుసార్లు ఆత్మహత్యకు యత్నించాడు. చందనారెడ్డితో తనకు ఎలాంటి సంబంధం వద్దని, తాను వేరే పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. దీనికి చందనా రెడ్డి ఒప్పుకోలేదు. ఇరు కుటుంబాలు పోలీస్‌స్టేషన్‌కు పంచాయతీకి వెళ్లారు. పంచాయతీ జరుగుతుండగానే వీరిద్దరూ ఆత్మహత్య చేసుకున్నారని, ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.