Contract teachers protest: 'క్రమబద్ధీకరణ పేరిట ఎందుకీ వివక్ష..' కాంట్రాక్టు అధ్యాపకుల నిరసన - తాడేపల్లిలో నిరసన
The contract teachers protested in Tadepalli: రాష్ట్ర ప్రభుత్వం క్రమబద్ధీకరణ పేరిట ఎంతో మందికి అన్యాయం చేసిందని కాంట్రాక్టు ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. 2014 జూన్ 2 నాటికి సర్వీసులో ఉన్న వారందరినీ క్రమబద్ధీకరించాలంటూ ఒప్పంద అధ్యాపకులు గుంటూరు జిల్లాలోని తాడేపల్లిలో నిరసన తెలిపారు. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిని కలిసేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చిన ఒప్పంద అధ్యాపకులు.. ఐదేళ్ల సర్వీసు పూర్తిచేసి ఉండాలనే నిబంధన ఎత్తివేయాలని నినదించారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు పదేళ్ల సర్వీసు వారందరినీ పర్మినెంట్ చేయాలని విజ్ఞప్తి చేశారు. సంవత్సరాల తరబడి పని చేస్తున్న తమకు కనీస గుర్తింపు దక్కలేదని, క్రమబద్ధీకరణ విషయంలో ప్రభుత్వం వెన్నుపోటు పొడించిందని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం జగన్ ప్రతిపక్ష నేత హోదాలో మాట్లాడుతూ.. అధికారంలోకి వస్తే ఒప్పంద, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులందరినీ రెగ్యులర్ చేస్తామని హామీ ఇచ్చి విస్మరించారని మండిపడ్డారు. సమాన పనికి సమాన వేతనం ఇస్తారని, రెగ్యులర్ చేస్తారని ఆశించాం కానీ, సీఎం జగన్ అవేమీ పట్టించుకోకుండా మాకు అన్యాయం చేశారని విన్నవించారు.