తెలంగాణలో 24 ఏళ్లకే గుండెపోటుతో కానిస్టేబుల్ మృతి - viral video of Hyderabad Constable death in gym
Telangana Constable Died Of Heart Attack In The Gym: మనిషి ఆరోగ్యంగా ఉన్నాడా.. అనారోగ్యంగా ఉన్నాడా అనే తేడా లేకుండా అకస్మాత్తుగా మరణిస్తున్నాడు. మృత్యువు ఏ విధంగా వచ్చి పలకరిస్తుందో చెప్పడం చాలా కష్టం అవుతోంది. మారుతున్న కాలంలో ప్రతి ఒక్కరి అలవాట్లలో చాలా వ్యత్యాసం కనపడుతోంది. మనిషి అరవై సంవత్సరాలు కూడా జీవించడం కష్టంగా మారుతోంది. ఈ మధ్య వయస్సుతో సంబంధం లేకుండా పసి పిల్లల నుంచి పండు ముసలి వారి వరకు ఎక్కువ మంది మరణించడానికి కారణమవుతోంది హార్ట్ ఎటాక్.
కొవిడ్ వచ్చిన తరువాత హృదయ సమస్యలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. కరోనా తరువాత ఆరోగ్యంగా ఉండడానికి మనిషి జాగ్రత్తలు పాటిస్తున్నారు. ఆహార విషయంలో శ్రద్ధ వహిస్తున్నారు. రకరకాల వ్యాయామాలు అలవాటు చేసుకున్నారు. కొన్ని సందర్భాల్లో వ్యాయామం చేస్తుండగానే కొంత మంది కుప్పకూలి క్షణాల్లో ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. తాజాగా తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్‌లో ఓ కానిస్టేబుల్‌కు కూడా ఇలాంటి పరిస్థితే ఎదురైంది.
కానిస్టేబుల్ విశాల్ జిమ్‌లో వ్యాయామం చేస్తూ గుండె పోటుతో మృతి చెందాడు. జిమ్‌లో వ్యాయామం చేస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలాడు. తన చుట్టూ ఉన్న వ్యక్తులు కాపాడటానికి వెంటనే ఆసుపత్రికి తలించారు. ఎంత ప్రయత్నించిన ప్రయోజనం లేకుండా పోయింది. విశాల్ హార్ట్ ఎటాక్‌తో చనిపోయాడని వైద్యులు తెలిపారు. అతనికి కేవలం 24 సంవత్సరాలు ఉండటం ఆశ్చర్యానికి కలిగిస్తోంది. విశాల్ ఆసిఫ్ నగర్లో 2020 నుంచి కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. కానిస్టేబుల్ గుండెపోటుతో కుప్పకూలిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.