Tulasi Reddy Fires on YS Jagan: 'అప్పు కోసమే.. వ్యవసాయ మోటార్లకు మీటర్లు' - తులసిరెడ్డి
Tulasi Reddy Fires on YS Jagan: కేంద్రం నుంచి వచ్చే అదనపు అప్పు కోసం.. మోదీ ప్రభుత్వ షరతులకు లొంగి రైతుల మోటార్లకు మీటర్లు బిగించాలని జగన్ ప్రభుత్వం నిర్ణయించడం దారుణమని కాంగ్రెస్ నేత తులసిరెడ్డి దుయ్యబట్టారు. కడప జిల్లా వేంపల్లిలో తులసి రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడారు. మన పొరుగు రాష్ట్రాలు తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ.. రైతులకు అన్యాయం చేయమని తేల్చి చెప్పి.. కేంద్ర ప్రభుత్వ షరతులకు ఒప్పుకోలేదని తెలిపారు. వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగించడం అంటే ఉచిత విద్యుత్ సరఫరా పథకాన్ని ఎత్తివేయడమేనని విమర్శించారు. ఇప్పుడు వ్యవసాయ మోటార్లకు.. మీటర్లు బిగిస్తే కరెంటు బిల్లులు వేలల్లో వస్తాయని మండిపడ్డారు. దీంతో బిల్లులు కట్టలేక రైతులు వ్యవసాయమే మానుకోవాలని లేదంటే సామూహిక ఆత్మహత్యలైనా చేసుకోవాలని తులసిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు బిగించే నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం విరమించుకోవాలని.. లేకపోతే రైతుల ఆగ్రహానికి వైసీపీ ప్రభుత్వం కొట్టుకుపోతుందని తులసి రెడ్డి హెచ్చరించారు.