Tulasi Reddy on Modi: ప్రధాని మోదీ పాలనలో సీబీఐ విశ్వసనీయత కోల్పోయింది: కాంగ్రెస్ నేత తులసి రెడ్డి
Congress Leader Tulasi Reddy on CBI: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాలనలో సీబీఐ విశ్వసనీయత కోల్పోయిందని.. జయలలిత, లాలు ప్రసాద్ యాదవ్, మనీష్ సిసోడియా, జగన్ మోహన్‌రెడ్డి లాంటి వాళ్లను అరెస్ట్ చేసిన సీబీఐ.. అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండడం శోచనీయమని ఏపీసీసీ ఛైర్మన్ తులసి రెడ్డి ఎద్దేవా చేశారు. కడప జిల్లా వేంపల్లెలోని ఆయన స్వగృహంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. తండ్రి భాస్కర్ రెడ్డిని పులివెందులలో ఆయన ఇంటిలో అరెస్ట్ చేసినప్పుడు ఉత్పన్నం కాని శాంతి భద్రతల సమస్య, కొడుకు అవినాష్ రెడ్డిని కర్నూలులో అరెస్ట్ చేస్తే ఉత్పన్నం అవుతుందని రాష్ట్ర పోలీసులు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ఒక వ్యక్తిని అరెస్ట్ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్న కేంద్ర ప్రభుత్వం.. దేశ సరిహద్దులను ఎలా కాపాడుగలుగుతుందని ఆయన ప్రశ్నించారు. పాకిస్తాన్లో సర్జికల్ స్ట్రైక్ చేశామని ఘనంగా చెప్పుకునే మోదీ ప్రభుత్వం దేశంలో ఒక వ్యక్తిని అరెస్ట్ చేయలేరా?అని ఆయన ప్రశ్నించారు. ఇప్పటికైనా సీబీఐ తన విశ్వసనీయతను నిరూపించుకోవాలని తులసి రెడ్డి సూచించారు.