Congress Leader Sake Sailajanath Fires on Govt: వైసీపీ ప్రభుత్వం పరిపాలన వదిలేసి.. ప్రతీకార రాజకీయాలు చేస్తోంది : శైలజానాథ్ - no water for farmers in ap
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 17, 2023, 2:42 PM IST
Congress Leader Sake Sailajanath Fires on Govt: రాష్ట్ర ప్రభుత్వం ప్రజా పరిపాలన వదిలేసి ప్రతీకార రాజకీయాలు చేస్తోందని పీసీసీ మాజీ అధ్యక్షుడు సాకే శైలజానాథ్ అన్నారు. అనంతపురంలోని పార్టీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. సాగునీరు అందివ్వడంలో రాయలసీమకు తీవ్ర అన్యాయం జరుగుతోందని మండిపడ్డారు. రైతులు నష్టపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో రైతుల ఆవేదనను చూడాలని కోరారు. అవసరమైతే కృష్ణా జలాలను మొత్తం రాయలసీమకు మళ్లించాలని డిమాండ్ చేశారు.
వైసీపీ... ఇప్పటిదాకా రాష్ట్రంలో ఒక్క ప్రాజెక్టును పూర్తి చేయలేదని.. నీటిపై దృష్టి సాధించకుండా ఇసుక, మద్యంపైనే ప్రభుత్వం దృష్టి సాధిస్తోందని శైలజానాథ్ ఆరోపించారు. ప్రజల కష్టాలను పట్టించుకోవాలని కోరారు. అదే విధంగా అధికారులు కేవలం తాడేపల్లి ఉత్తర్వులు పాటించడం మాత్రమే కాకుండా ప్రజలను సైతం పట్టించుకోవాలని అన్నారు. నీళ్లు లేక రైతులు ఆవేదన చెందుతున్నారని.. వారి కష్టాలను ఒకసారి చూడండని పేర్కొన్నారు. రాజకీయాలను పక్కన పెట్టి రైతుల కోసం ఏమైనా మంచి చేయాలని హితవు పలికారు.