పెనమలూరు వైఎస్సార్సీపీలో రాజుకున్న అసమ్మతి- జోగి రమేశ్ వద్దంటూ ర్యాలీలు - ఏపీ ఎన్నికలు
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 13, 2024, 5:06 PM IST
Conflicts in Penamaluru YSRCP: కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలోని రాజకీయాలు వేడెక్కాయి. సిట్టింగ్ ఎమ్మెల్యే కొలుసు పార్థసారథిని కాదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం జోగి రమేశ్‌ను నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌గా ప్రకటించింది. దీంతో జోగి రమేశ్ ఇన్‌ఛార్జ్ నియమాకాన్ని ఆపార్టీ శ్రేణులు వ్యతిరేకించాయి. ఎక్కడి నుంచో వచ్చిన వారికి ఇన్‌ఛార్జ్ బాధ్యతలు ఇవ్వడం ఏంటని స్థానిక నేతలు ప్రశ్నిస్తున్నారు. తమకు అందుబాటులో ఉండే కమ్మ కార్పొరేషన్ చైర్మన్ తుమ్మల చంద్రశేఖర్‌కి ఆ బాధ్యతలు ఇవ్వాలంటూ, కోలవెన్ను నుంచి కంకిపాడు వరకు ఆయన అనుచరులు ర్యాలీ నిర్వహించారు. బుడ్డికి సీటు ఇవ్వకపోతే తామంతా రాజీనామా చేస్తామని హెచ్చరించారు. పార్థసారథిని అని ఆయనను కాదని వేరే వ్యక్తిని ఎంపిక చేశారని కార్యకర్తలు మండిపడ్డారు. పార్థసారథిని కాకపోతే బుడ్డినైనా ఎంపిక చేయాల్సిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలా కాదని స్థానికేతరులను ఎలా ఎంపిక చేస్తారని ప్రశ్నించారు. చంద్రశేఖర్నైనా ఎంపిక చేస్తారని భావించామని వెల్లడించారు. కానీ, స్థానికేతరులను ఎంపిక చేశారని, ఇప్పటికైనా అధిష్టానం స్థానికులనే పెనమాలురు నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌గా నియమించాలని కోరారు.