Madakasira: రసాబాసగా సర్వసభ్య సమావేశం.. నేలపై కూర్చోని వైసీపీ కౌన్సిలర్ నిరసన
Madakasira Nagara Panchayat: శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర నగర పంచాయతీ సర్వసభ్య సమావేశం రసాబాసగా మారింది. తమ వార్డులలో నెలకొన్న సమస్యలను అధికారులు పరిష్కరించటం లేదని.. అధికార పార్టీకి చెందిన కౌన్సిలర్లు సమావేశంలో నేలపై కూర్చొని నిరసన తెలిపారు. సమస్యలు పేరుకుపోతున్నా పట్టించుకునే వారే లేరని.. కౌన్సిలర్లు సమావేశంలొ అధికారులతో వాగ్వాదానికి దిగారు. సమస్యలపై అధికారులను సంప్రదిస్తే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ.. మితిమీరిన లంచగొండితనానికీ పాల్పడుతున్నారని ఆరోపించారు. సమస్యలపై కౌన్సిల్ సమావేశంలో కౌన్సిలర్లు ప్రశ్నలను లేవనెత్తారు. 13వ వార్డు వైసీపీ మహిళా కౌన్సిలర్ నేలపై కూర్చొని నిరసన తెలిపారు. సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక మున్సిపల్ కమిషనర్ ప్రభాకర్ రావు, అధికారులు అర్థాంతరంగా సమావేశం నుంచి లేచి వెళ్లిపోయారు. అధికారుల తీరును నిరసిస్తూ కౌన్సిలర్లు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
లంచం తీసుకున్నారని కమిషనర్‌పై ఆరోపణలు : మరోవైపు మడకశిర నగర పంచాయతీ కమిషనర్ లంచం తీసుకున్నాడంటూ ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. మడకశిరలో టీ కొట్టు నడిపిస్తున్న ఓ వ్యక్తి ఇటీవల కరెంటు మీటర్ కోసం.. మున్సిపాలిటీ ఎన్వోసీ సర్టిఫికెట్ కోసం నగర పంచాయతీకి వెళ్లాడు. దీంతో కమిషనర్ ప్రభాకర్ రావు 5000 రూపాయలు డిమాండ్ చేశాడని.. చివరకు వెయ్యి రూపాయలు తీసుకున్నాడనే వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరలయ్యింది. మీడియా దీనిపై కమిషనర్‌ను వివరణ కోరగా.. తనపై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని.. తనను కావాలని ఇబ్బంది పెట్టేందుకు ఇలా చేశారని వివరించారు. చలానా చెల్లించేందుకు మాత్రమే నగదు తీసుకున్నానని.. లంచం కాదని ఆరోపణలను కొట్టిపారేశారు.