Spandana program: కలెక్టర్ గారు స్పందించడి.. లేదా కారుణ్య మరణానికి అనుమతించండి..! - ఏపీ తాజా
Spandana program: కారుణ్య మరణానికి అనుమతి ఇవ్వాలంటూ.. గుంటూరు జిల్లా కలెక్టరెేట్లో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో హరికిషన్ అనే బాధితుడు ఫిర్యాదు చేశారు. ఉద్యాన శాఖ కమిషనర్ శ్రీధర్ బిల్లులు మంజూరు చేయకుండా వేధింపులకు గురి చేస్తున్నాడని హరికిషన్ ఆవేదన వ్యక్తం చేశాడు. తనకి రావాల్సిన 11 లక్షల రూపాయలు బకాయిలు ఇప్పించకుంటే తనకి మరణమే శరణ్యమంటూ కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నాడు. ఎన్నో సార్లు మంత్రి కార్యాలయం, నుంచి కమిషనర్‌కు చెప్పించిన పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశాడు.
నిధులు మంజూరు కోసం రాజమండ్రి కలెక్టర్ చెప్పినా.. ఉద్యాన శాఖ కమిషనర్ శ్రీధర్ కలెక్టర్ ఆదేశాలు బేఖాతర్ చేస్తున్నారని అన్నారు. వ్యవసాయ శాఖకు సంబంధించి 2021లో మూడు ఎలక్ట్రికల్ ఆటోలను సప్లై చేసినట్లు హరికిషన్ తెలిపాడు. తనకు న్యాయం చేయాలంటూ కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డిని చేతులెత్తి వేడుకున్నాడు. దిక్కుతోచని పరిస్థితుల్లో కారుణ్య మరణానికి అనుమతి ఇవ్వాలంటూ స్పందనలో కలెక్టర్‌కి వినతి పత్రం ఇవ్వడానికి వచ్చినట్లు తెలిపాడు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తనకురావల్సిన బిల్లులు చెల్లించకపోతే ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని బాధితుడు హరికిషన్ వెల్లడించాడు.