విజయనగరం రైలు ప్రమాద బాధిత కుటుంబాలకు పరిహారం అందించిన మంత్రి బొత్స - బొత్స సత్యనారాయణ చిత్రాలు
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 1, 2023, 7:19 PM IST
Compensation to Train Accident Victim Families: విజయనగరం జిల్లా కంటకాపల్లి రైలు ప్రమాద బాధితులు 43మందికి రాష్ట్ర ప్రభుత్వం రూ.2.59 కోట్లు పరిహారం ఇవ్వనున్నట్లు మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. విజయనగరం సర్వజన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కొందరికి రెండో విడతగా మంత్రి బొత్స, జిల్లా కలెక్టర్ నాగలక్ష్మితో కలసి పరిహారం అందచేశారు. రైలు ప్రమాద బాధితులకు పరిహారం పంపిణీ అనంతరం మంత్రి బొత్స మీడియాతో మాట్లాడుతూ... రైలు ప్రమాద క్షతగాత్రులను పరామర్శించడానికి వచ్చిన సీఎం జగన్.. ఆ తర్వాత పరిహారాన్ని రివైజ్ చేశారని తెలిపారు.
మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.10 లక్షలు పరిహారం ఇస్తోందని బొత్స వెల్లడించారు. వారితో పాటు మిగిలిన వారినీ తగిన విధంగా ఆదుకువాలనే ఆలోచనతో క్షతగాత్రులకు పరిహారం పెంచామన్నారు. ఈ మేరకూ నెలరోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 12మందికి 2లక్షలు.. రెండు నుంచి ఐదు నెలల పాటు చికిత్స అవసరమైన 15మందికి 5లక్షలు చొప్పున పరిహారం అందచేస్తామన్నారు. శాశ్వత అంగవైకల్యం పొందే అవకాశం ఉన్న ముగ్గురు బాధితులకు, మృత్యుల కుటుంబాలతో సమానంగా 10లక్షల చొప్పున పరిహారం ఇస్తున్నట్లు మంత్రి తెలిపారు. రైలు ప్రమాద బాధితుల్లో మృతులు, గాయపడిన వారు మొత్తం కలిపి... 43మందికి రాష్ట్ర ప్రభుత్వ తరపున రూ. 2కోట్ల 59లక్షల రూపాయలు పరిహారం అందనుందని బొత్స తెలిపారు. ఇప్పటికే.. మొదటి విడతగా నిన్న కొంతమంది బాధితులకు కోటీ 2లక్షల రూపాయలు పరిహారం అందించామన్నారు. మిగిలిన వారందరికీ నేడు పరిహారం అందించినట్లు చెప్పారు. ఈ పరిహారంతో బాధిత కుటుంబాల జీవితాలు మారిపోతాయని తాము భావించడం లేదని.. ఈ సహాయం వారికి ఉపశమనం మాత్రమే అని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు.