ఒంగోలులో భూకబ్జాల వెనక పూర్ణచంద్రరావు ముఠా! సిట్ దర్యాప్తులో 38 మంది అరెస్టు! - Collector Dinesh on Ongole Land Scam
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 3, 2023, 7:31 PM IST
|Updated : Nov 3, 2023, 10:11 PM IST
Collector Dinesh Kumar on Ongole Land Scam:ఒంగోలు భూకబ్జాలకు సంబంధించి.. ప్రకాశం జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్, ఎస్పీ మల్లికాగార్గ్ పలు కీలక విషయాలను వెల్లడించారు. నాలుగైదు విధాలుగా నకిలీ పత్రాలు సృష్టించి.. భూములు కబ్జా చేస్తున్న పూర్ణచంద్రరావు అనే ముఠాకు చెందిన 38 మందిని అరెస్టు చేశామన్నారు. మార్కాపురం, కనిగిరి, యర్రగొండపాలెంలోనూ ఇదే తరహా భూకబ్జాలు జరుగుతున్నట్లు ఫిర్యాదులు వచ్చాయన్నారు. భూకబ్జాలపై సిట్ పక్కాగా దర్యాప్తు చేస్తోందని, ముఠాలో అన్ని పార్టీలకు చెందిన వారున్నారని వెల్లడించారు.
Dinesh Kumar Comments:ఒంగోలు భూకబ్జాలపై కలెక్టర్ దినేష్ కుమార్, ఎస్పీ మల్లికాగార్గ్‌లు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ దినేష్ కుమార్ మాట్లాడుతూ..''ఒంగోలులో భూకబ్జాలపై ఫిర్యాదులు వచ్చాయి. ఫిర్యాదులతో పోలీసులు లాయర్‌పేటలోని ఓ ఇంట్లో సోదాలు చేశారు. పూర్ణచంద్రరావు అనే వ్యక్తి కొన్ని పత్రాలు సృష్టిస్తున్నట్లు గుర్తించారు. మీసేవలో లభించే పత్రాలకు నకిలీ స్టాంపులు సృష్టించి ఫోర్జరీ చేశారు. 123 నకిలీ డాక్యుమెంట్లు, 25 నకిలీ స్టాంపులు సీజ్ చేశాం. భూకబ్జాలపై సిట్ ఏర్పాటు చేశాక ఇప్పటివరకు 572 నకిలీ పత్రాలు సీజ్ చేశాం. 1200 జ్యుడీషియల్, నాన్ జ్యుడీషియల్ పత్రాలు స్వాధీనం చేసుకున్నాం. భూకబ్జా కేసులో 38 మందిని కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నాం.'' అని అన్నారు.
''భూకబ్జాలపై కేసు దర్యాప్తు వేగంగా జరుగుతోంది. పూర్ణచంద్రరావు ఇంట్లో స్వాధీనం చేసుకున్న పత్రాల్లో 72 నకిలీవిగా గుర్తించాం. పూర్ణచంద్రరావు ముఠాపై ఇప్పటివరకు 54 కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు 38 మందిని అరెస్టు చేశాం. మరో 40 మందిని త్వరలో అరెస్టు చేస్తాం. 10-12 ఏళ్లుగా ఖాళీగా ఉన్న స్థలాలను గుర్తించి నకిలీ పత్రాలతో భూకబ్జాలు చేస్తున్నారు. ఇలాంటివి ఒంగోలులో 52 ఆస్తులు గుర్తించాం. భూకబ్జాల కేసులో ఒక ప్రభుత్వ ఉద్యోగిని అరెస్టు చేశాం.''-మలికా గార్గ్, ప్రకాశం ఎస్పీ