Gorukallu Reservoir sagging కుంగిపోతున్న గోరుకల్లు జలాశయం కట్ట.. భయాందోళనలో రైతులు - తెలుగు ప్రధాన వార్తలు
Collapsing Gorukallu Reservoir Embankment : గోరుకల్లు జలాశయం ప్రమాదకరంగా మారింది గత నాలుగు రోజుల నుంచి జలాశయ కట్ట కుంగిపోతుండడంతో గ్రామస్థులు భయాందోళన చెందుతున్నారు. వివరాల్లోకి వెళితే.. నంద్యాల జిల్లా పాణ్యం మండలంలోని గోరుకల్లు జలాశయం కట్ట కుంగిపోవటంతో రైతులు భయాందోళన చెందుతున్నారు. రాయలసీమ ప్రాంతంలో రైతులకు సాగునీటికి ఆధారమైన గోరుకల్లు జలాశయం ఇప్పటివరకు కురిసిన భారీ వర్షాలకు కోతకు గురై పెద్ద ప్రమాదకరంగా తయారైందని రైతులు చెబుతున్నారు. గత మూడు సంవత్సరాలుగా జలాశయానికి నిర్వహణ నిధులు ఇవ్వకపోవడంతో జలాశయ కట్టపై పెద్దపెద్ద కంపచెట్లు పెద్ద పెద్ద గుంతలు ఏర్పడ్డాయని, జలాశయానికి మరమ్మతులు చేపట్టకపోవటంతో కట్ట కుంగిపోతుందని రైతులు తెలిపారు. కుంగిపోతున్న కట్టను సీఈ కబీర్ భాష, డీఈ శుభకుమార్ పరిశీలించారు. మట్టి కట్ట రక్షణకు చేపట్టాల్సిన చర్యలపై అధికారులతో చర్చించారు. కట్టను ప్రతిష్టం చేసేందుకు ప్రతిపాదనలు పంపాలని నీటి నిల్వ తగ్గించి మరమ్మతులు చేపట్టాలని ప్రాజెక్టు అధికారులకు సూచించారు. త్వరగా పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకొని సాగునీటికి ఇబ్బందులు లేకుండా చూస్తామని సీఈ కబీర్ భాష పేర్కొన్నారు.