ఉర్సు ఉత్సవాలకు ముఖ్యమంత్రి జగన్ - భారీ ఏర్పాట్లు చేస్తున్న అధికారులు - కడప జిల్లాలో పర్యటించనున్న జగన్మోహన్ రెడ్డి
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 29, 2023, 12:43 PM IST
CM Jagan Visits In Kadapa In Darga Urusu Festival: కడప పెద్ద దర్గాలో జరుగుతున్న ఉరుసు ఉత్సవాలకు గురువారం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హాజరుకానున్నారు. ఈ నెల 30న కడప జిల్లాలో పర్యటించనున్న జగన్మోహన్ రెడ్డి.. పెద్ద దర్గాను సందర్శించనున్నారు. ప్రసిద్ధిగాంచిన కడప పెద్ద దర్గా ఉరుసు ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా 79వ కవి సమ్మేళనాన్ని నిర్వహించగా.. వివిధ రాష్ట్రాల నుంచి భారీ ఎత్తున కవులు, భక్తులు ఈ ఉత్సవాలకు హాజరయ్యారు. కవులు పాడేటువంటి పాటలు, కవితలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ కవి సమ్మేళనాన్ని తిలకించేందుకు భక్తులు ఆసక్తిచూపారు.
అంతకుముందు మహానైవేద్య కార్యక్రమాన్ని నిర్వహించారు. మాలింగ్షాను మూడు రోజుల అనంతరం పీర్ స్థానం నుంచి విముక్తి కలిగించారు. ప్రజలు ఈ ఉరుసు ఉత్సవాలను ఎంతో ఆసక్తికరంగా తిలకించారు. సీఎం పర్యటనకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ముందుగానే జిల్లా కలెక్టర్, ఎస్పీలు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. దర్గా పరిసర ప్రాంతాలను కడప ఎస్పీ పరిశీలించారు.