CM Jagan Tweet on Train Accident Incident: రైలు ప్రమాద ఘటన.. పలు సందేహాలు లేవనెత్తుతోంది: సీఎం జగన్ - ycp on jagan
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 30, 2023, 10:06 PM IST
CM Jagan Tweet on Train Accident Incident: విజయనగరం జిల్లా కంటకాపల్లివద్ద నిన్న రాత్రి జరిగిన రైలు ప్రమాదం ఘటనలో రైల్వేలో పలు వ్యవస్థల పనితీరుపై పలు అనుమానాలు ఉన్నట్లు కనిపిస్తోందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అభిప్రాయపడ్డారు. ఒకే మార్గంలో వెళ్తూ ఆగి ఉన్న రైలును మరో రైలు ఢీకొట్టిన ప్రమాద ఘటన కొన్ని ప్రశ్నల్ని లేవనెత్తుతోందని ట్విటర్ ద్వారా సీఎం తెలిపారు. బ్రేకింగ్ వ్యవస్థ, హెచ్చరిక వ్యవస్థలు ఎందుకు పని చేయలేదని సీఎం ప్రశ్నించారు. రైల్వే సిగ్నలింగ్ వ్యవస్థ ఎందుకు విఫలమైందని ట్విటర్ (ఎక్స్) ద్వారా సీఎం ప్రశ్నించారు.
రైళ్ల కమ్యూనికేషన్ వ్యవస్థ సైతం ఎందుకు వైఫల్యం చెందిందని ప్రశ్నించారు. ఈ అంశాల పరిశీలనకు ఉన్నతస్థాయి ఆడిట్ కమిటీని వేయాలని ప్రధాని మోదీని, రైల్వే మంత్రిని సీఎం కోరారు. ఈ ఘటన తనను తీవ్రంగా బాధించిందన్న ముఖ్యమంత్రి.. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలకు తావివ్వకుండా దేశంలోని అన్ని మార్గాల్లోనూ ఈ తరహా ఆడిట్ జరగాల్సి ఉందని పేర్కొన్నారు. ప్రమాద ఘటనలో మృతి చెందినవారికి తన సానుభూతి ఉంటుందని, క్షతగాత్రులకు వైద్యం అందించటంలో ప్రభుత్వం వారికి తోడుగా ఉంటుందని ట్విటర్లో వెల్లడించారు.