CM Tour Tress Cuts: బాబోయ్ సీఎం జగన్ పర్యటన.. హడలెత్తిపోతున్న జనం - సీఎం పర్యటన
CM Jagan Tour Trees Cuts: ముఖ్యమంత్రి పర్యటనలు రాష్ట్ర ప్రజలకు తిప్పలు తెచ్చిపెడుతున్నాయి. ఆయన వస్తున్నారంటేనే జనాలు హడలెత్తిపోతున్నారు. సీఎం పర్యటన ఎక్కడైనా.. చెట్లు నరకడం, దుకాణాలు, హోటళ్లు మూసివేయించడం కామన్ అయిపోయింది. పరిసరాలు శుభ్రం చేసి మొక్కలు నాటాల్సింది పోయి.. పచ్చని చెట్లు నరికేస్తారు. భారీ వృక్షాలను జేసీబీలతో పెకలించేస్తారు. పర్యావరణ విధ్వంసం మామూలుగా ఉండదు. తాజాగా అనంతపురంలో కూడా ఇదే తంతు కొనసాగుతోంది. ఈ నెల 8వ తేదీన అనంతపురం జిల్లా కళ్యాణదుర్గానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వస్తున్నారు. వైఎస్సార్ అగ్రి ల్యాబ్లను ప్రారంభించనున్నారు. ఈ క్రమంలో పర్యటన ఏర్పాట్ల పేరుతో అధికారులు, పోలీసులు చేసే హడావుడి అంతా ఇంతా కాదు. ముఖ్యమంత్రి దిగడానికి ఏర్పాటు చేసిన హెలిపాడ్ నుంచి పట్టణంలోకి వెళ్లే రహదారిలో ధర్మవరం రోడ్డు పక్కనున్న చెట్ల కొమ్మలు తొలగిస్తున్నారు. ఇదిలా ఉంటే.. రోడ్డు వెడల్పు కార్యక్రమంలో భాగంగా విద్యుత్ తీగలకు అడ్డంగా ఉన్నాయంటూ.. చెట్ల కొమ్మలు తొలగించేశారు. పచ్చని చెట్లను బలవంతంగా కూల్చేయడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.