వైఎస్‌ఆర్ లా నేస్తం నిధులు విడుదల చేసిన సీఎం జగన్ - Cm jagan news
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 11, 2023, 4:10 PM IST
CM Jagan Released YSR Law Nestham Funds:రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో 2023–24 సంవత్సరానికి సంబంధించి, రెండో విడత కింద వైఎస్సార్ లా నేస్తం నిధులను బటన్ నొక్కి విడుదల చేశారు. అనంతరం అర్హులైన 2,807 మంది జూనియర్ న్యాయవాదులకు నెలకు రూ.5 వేలు చొప్పున స్టైపెండ్ అందిస్తున్నట్లు పేర్కొన్నారు.
CM Jagan Comments: ''రాష్ట్ర వ్యాప్తంగా 2,807 మంది అర్హులైన జూనియర్ న్యాయవాదులకు రూ.30 వేల చొప్పున మొత్తం 7కోట్ల 98లక్షల 95 వేల రూపాయలను వారి ఖాతాల్లో జమ చేశాం. నెలకు రూ.5,000 చొప్పున ఒక్కో న్యాయవాదికి స్టైఫండ్ అందిస్తున్నాం. ఈ లా నేస్తం ద్వారా ఇప్పటివరకు 6069 మంది న్యాయవాదులకు మేలు జరిగింది. నాలుగున్నరేళ్లలో రూ.49.51 కోట్లు అందించాం. రూ.100 కోట్లతో అడ్వకేట్స్ వెల్ఫేర్ ట్రస్ట్‌ను ఏర్పాటు చేశాం. ప్రతి పేదవాడి తరపున న్యాయవాదులంతా ఔదార్యం చూపించాలి. పేదలకు యువ లాయర్లంతా న్యాయం చేయాలి. రూ.5వేల స్టైఫండ్ చొప్పున, ప్రతి సంవత్సరానికి రూ.60వేలు, మూడేళ్లకు రూ.1.80 లక్షలు ఇస్తూ మీ కాళ్లమీద మీరు నిలబడేందుకు తోడుగా ఈ ఆర్థిక సాయం అందిస్తున్నాం'' అని సీఎం జగన్ అన్నారు.