CM Thodu Funds released: 'జగనన్న తోడు'.. ఇలాంటి పథకం దేశంలో ఎక్కడా లేదు: సీఎం జగన్ - Jagananna Todu scheme news
CM Jagan released funds of Jagananna Todu scheme: రాష్ట్రంలో చిరు వ్యాపారాలు చేసుకుంటూ.. జీవనం సాగిస్తోన్న 5 లక్షల 10 వేల 412 మందికి 'జగనన్న తోడు పథకం' కింద 560 కోట్ల 73 లక్షల రూపాయలను ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి బటన్ నొక్కి విడుదల చేశారు. ఈ పథకం ద్వారా చిరు వ్యాపారులు, హస్త కళాకారులు, సంప్రదాయ వృత్తుల వారిని ఆదుకునేందుకు ఏటా పది వేల వరకు వడ్డీ లేని రుణాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తోందని సీఎం జగన్ వెల్లడించారు. సకాలంలో రుణాన్ని చెల్లించిన వారికి రూ.15వేల వరకు రుణాన్ని పెంచుతామని తెలిపారు.
దేశంలో ఈ రకంగా మంచి చేయడం లేదు.. ముఖ్యమంత్రి జగన్ మాట్లాడుతూ.. ''నేడు జగనన్న తోడు ఏడో విడత నిధులను విడుదల చేయటం ఆనందంగా ఉంది. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇన్ని లక్షల మందికి ఈ రకంగా మంచి చేయడం లేదు. ఇన్ని లక్షల మంది చిరు వ్యాపారులకు ఎక్కడా కూడా ఇంత మేలు జరగటం లేదు. ఈ పథకం ద్వారా దాదాపు 5,10,412 మంది లబ్దిదారుల ఖాతాల్లోకి రూ. 549.70 కోట్ల నిధులు విడుదల చేస్తున్నాం. ఈ జగనన్న తోడు కింద రాష్ట్రంలోని చిరు వ్యాపారులకు పెట్టుబడి సాయంగా ఒక్కొక్కరికి రూ.10 వేల నుంచి రూ. 15 వేల వరకు వడ్డీలేని రుణాలు అందిస్తున్నాం'' అని జగన్ అన్నారు.
రూ.549.70 కోట్లు విడుదల..చిరు వ్యాపారుల కోసం వైఎస్సార్సీపీ ప్రభుత్వం 2020 నవంబరు 25వ తేదీన ‘జగనన్న తోడు’ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ కార్యక్రమం ద్వారా తోపుడు బండ్లు, రోడ్ల వెంట చిన్న దుకాణాలు, పండ్లు, కూరగాయలు, టీ, టిఫిన్ వ్యాపారాలతోపాటు.. సాంప్రదాయ చేతివృత్తుల కళాకారులకు జగనన్న తోడు పథకం కింద ఆర్థికసాయం అందిస్తున్నారు. ఈ పథకం కింద చిరు వ్యాపారులకు రూ.10,000 రుణం అందజేస్తున్నారు. మంగళవారం ఈ పథకం కింద 5,10,412 మందికి ప్రభుత్వం మరో విడతగా రూ. 549.70 కోట్లను విడుదల చేసింది.