Jagan met Nirmala: కేంద్ర ఆర్థిక మంత్రితో సీఎం జగన్ భేటీ.. అందుకేనా..! - NITI Aayog Governing Body Meeting
రాష్ట్రంలో విద్యా, వైద్య రంగాల్లో వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి విప్లవాత్మక చర్యలు చేపట్టిందని.. దానిని మూలధన వ్యయంగా పరిగణించి బడ్జెట్‌లో చెప్పినట్లుగా ప్రత్యేక సాయం చేయాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సీఎం జగన్ కోరారు. 4వేల కోట్లతో విలేజ్ క్లీనిక్‌ల నుంచి టీచింగ్ ఆసుపత్రుల వరకూ అనేక చర్యలు చేపట్టామని తెలిపారని ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో వెల్లడించింది. నాడు-నేడు కింద పాఠశాలల అభివృద్ధి కోసం ఇప్పటికే 6 వేల కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. తొలిదశలో 15వేల 717 స్కూళ్ల ఆధునీకరణ పూర్తయినట్లు ఆయన వివరించారు. 2014-15 కి సంబంధించిన వనరుల గ్యాప్ ఫండింగ్, 2016-19 మద్య కాలంలో పరిమితికి మించి తీసుకున్న రుణాల కారణంగా ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఎదుర్కొంటున్న పర్యావసానాలు, 2021-22 రుణాల పరిమితిపై సడలింపులపై చర్చించారు. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ డిస్కంలకు ఏపీ జెన్‌కో సరఫరా చేసిన విద్యుత్, 6వేల 7వందల 56 కోట్ల బకాయిల అంశాన్ని ప్రస్తావించారు. ఏపీ జెన్‌కో ఇప్పటికే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుందని....జాప్యం లేకుండా వీలైనంత త్వరగా ఈ డబ్బు ఇప్పించాలని కోరినట్లు సీఎం కార్యాలయం తెలిపింది. కాగా సీఎం జగన్ మూడు రోజులు దిల్లీలో ఉండనున్నారు. ఇవాళ ప్రగతి మైదాన్‌లో జరిగే నీతి అయోగ్ పాలకమండలి సమావేశంలో , రేపు జరగనున్న నూతన పార్లమెంటు భవనం ప్రారంభోత్సవంలో పాల్గొననున్నారు.