వైసీపీ మంత్రుల తీరుపై సీఎం జగన్ అసహనం - State Council meeting
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 4, 2023, 11:14 AM IST
CM Jagan Impatient on YSRCP Ministers: రాష్ట్ర మంత్రిమండలి సమావేశంలో ముఖ్యమంత్రి జగన్.. మంత్రుల తీరుపై ఒకింత అసహనం వ్యక్తం చేశారు. సమావేశాల్లో ఏం మాట్లాడినా.. మంత్రులు బయటకు వెళ్లిన తర్వాత ఎవరికో ఒకరికి చెప్పేస్తున్నారని అసహనం వ్యక్తపరిచారు. అందువల్ల ఇక్కడ మాట్లాడుకోవడం, చర్చించుకోవడం ఎందుకులే అని మంత్రులతో అన్నారు. సాధారణంగా మంత్రిమండలిలో ఎజెండా అంశాలపై అధికారులతో చర్చ తర్వాత.. మంత్రులతో సీఎం భేటీ అవుతారు. ప్రభుత్వ పరంగా చేస్తున్న కార్యక్రమాలు, ప్రభుత్వ కార్యక్రమాలకు రాష్ట్ర ప్రజల నుంచి వస్తున్న స్పందన వంటి పాలనపరమైన అంశాలను ఇందులో చర్చిస్తుంటారు. అంతేకాకుండా ప్రతిపక్షాల విమర్శలు, వాటిని ఎలా ఎదుర్కోవాలి, పార్టీ పరంగా మంత్రులకు ఎలాంటి బాధ్యతలు అప్పగించాలనే వంటి అంశాలపైనా మంత్రులతోనూ సీఎం మాట్లాడుతుంటారు. శుక్రవారం నిర్వహించిన భేటీలో ఈ చర్చ ఏమీ వద్దని చెప్పి.. సమావేశం ముగించుకుని వెళ్లిపోయినట్లు సమాచారం. అయితే మంత్రివర్గ సమావేశం శుక్రవారం ఉదయం ప్రారంభం కాగా.. పలు సంక్షేమ పథకాలు ప్రారంభానికి ఆమోదం తెలిపింది. అంతేకాకుండా రాష్ట్రంలోకి పలు పెట్టుబడలకు మంత్రివర్గం ఆమోదించిది.