CM Jagan Comments on CPS in APNGO Meeting: "సీపీఎస్ రద్దుపై మాట తప్పే ఉద్దేశం ఉంటే.. జీపీఎస్ తెచ్చేవాళ్లం కాదు" - ఏపీ ఎన్జీవోల బహిరంగ సభ
CM Jagan Comments on CPS in APNGO Meeting: సీపీఎస్ రద్దు అసాధ్యమని ముఖ్యమంత్రి జగన్ ప్రకటించారు. సుదీర్ఘ అధ్యయనం తర్వాత ఓపీఎస్‌కు బదులు జీపీఎస్ తీసుకొస్తున్నట్లు వెల్లడించారు. జీపీఎస్‌తో ఉద్యోగులకు మంచి జరుగుతుందని భావిస్తున్నట్లు చెప్పారు. సీపీఎస్ రద్దుపై మాట తప్పే ఉద్దేశం ఉంటే జీపీఎస్ కూడా తెచ్చేవాళ్లం కాదన్నారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఏపీ ఎన్జీవోల బహిరంగ సభలో ముఖ్యమంత్రి జగన్ పాల్గొన్నారు.
సీపీఎస్ సమస్య పరిష్కారానికి చిత్తశుద్ధితో పని చేస్తున్నట్లు సీఎం జగన్ తెలిపారు. సీపీఎస్ బదులు తమ ప్రభుత్వం మెరుగైన విధానం తీసుకువస్తున్నట్లు వెల్లడించారు. సీపీఎస్ అంశంపై సుదీర్ఘమైన అధ్యయనం చేసి ఎంప్లాయ్ గ్యారెంటీడ్ పెన్షన్ స్కీమ్ తీసుకువచ్చామన్నారు. గ్యారెంటీడ్ పెన్షన్ స్కీమ్‌పై త్వరలోనే ఆర్డినెన్స్ వస్తుందన్నారు. ప్రభుత్వానికి భారం పడకుండా ఉద్యోగులకు నష్టం లేకుండా జీపీఎస్ విధానం అమలు చేస్తామని హామీ ఇచ్చారు. ఏపీ అమలు చేయబోయే జీపీఎస్‌ను దేశమే కాపీ కొడుతుందన్నారు. దసరా పండుగ రోజు ఉద్యోగులకు ఒక డీఏ ఇస్తామని ప్రకటించారు. మహిళా ఉద్యోగులకు 5 రోజుల అదనపు క్యాజువల్ లీవ్ మంజూరు చేస్తామని వెల్లడించారు. ఉద్యోగులు అడిగిన అన్ని అంశాలు ఇవ్వలేకపోవచ్చు కానీ ప్రభుత్వం మీదని భావించాలని ఉద్యోగులను జగన్ కోరారు.